కూకట్ పల్లిలో కండ్లలో కారంకొట్టి రూ. కోటి హవాలా డబ్బు దోపిడీ

కూకట్ పల్లిలో కండ్లలో కారంకొట్టి రూ. కోటి హవాలా డబ్బు దోపిడీ
  •     కూకట్​పల్లిలో ఘటన 
  •     యజమాని దగ్గర పని చేస్తున్న వర్కరే సూత్రధారి 

కూకట్​పల్లి, వెలుగు: హైదరాబాద్​లోని కూకట్‌‌‌‌పల్లిలో సోమవారం రాత్రి బైక్​పై హవాలా డబ్బు తరలిస్తుండగా, కండ్లలో కారం కొట్టి కొందరు దోపిడీ చేశారు. యజమాని దగ్గర పనిచేసే వ్యక్తే అంతా చేసి, సైలెంట్​ వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. . పోలీసులు 24 గంటల్లోనే అసలు విషయం కనిపెట్టారు. బహదూర్‌‌‌‌పురాకు చెందిన అమీర్ హవాలా నిర్వహిస్తున్నాడు. ఖుస్రుద్ధీన్, నజీముద్ధీన్ నగదు తరలించేందుకు వర్కర్లుగా పని చేస్తున్నారు. యజమాని డబ్బుపై కన్నేసిన ఖుస్రుద్దీన్​ ఎలాగైనా దోపిడి చేయాలని ప్లాన్​ వేశాడు. డ్రైవర్‌‌‌‌ ఒమర్ షరీఫ్‌‌‌‌తో పరిచయం పెంచుకుని దోపిడికి ఒప్పించాడు. 

సోమవారం అమీర్.. కూకట్‌‌‌‌పల్లిలో ఉండే పవన్​ దగ్గర నుంచి అదే ప్రాంతంలో ఉండే ఇబ్రహీమ్​కు హవాలా అందించాలని ఖుస్రుద్ధీన్‌‌‌‌కు, నజీముద్దీన్​కు పంపించాడు. ఈ వివరాలను ఖుస్రుద్ధీన్ ఒమర్ కు చేరవేశాడు. అతను ఏడుగురు ముఠా సభ్యులతో సిద్ధమయ్యాడు. ఖుస్రుద్ధీన్‌‌‌‌కు, నజీముద్దీన్​ రాత్రి 9.30కి పవన్​ వద్దకు వెళ్లి, అతని సూచనలతో రూ. కోటి ఉన్న కాటన్ బాక్స్ ను ఇబ్రహీంకు ఇచ్చేందుకు బయల్దేరారు. 

ఈక్రమంలో ఒమర్ ముఠా సభ్యులు మూడు బైక్‌‌‌‌లపై వచ్చి, కూకట్​పల్లిలో బైక్‌‌‌‌పై వెళ్తున్న ఖుస్రుద్దీన్​, నజీముద్దీన్​ కళ్లలో కారం కొట్టి, డబ్బు బాక్స్ తో పరారయ్యారు. ఖుస్రుద్ధీన్ ఏమీ తెలియనట్టు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనాస్థలానికి వచ్చిన పోలీసులు.. నిందితులు వదిలివెళ్లిన బైక్‌‌‌‌ను స్వాధీనం చేసుకొని, వాళ్లు శంషాబాద్ ఎయిర్​ పోర్ట్​లో ఉన్నట్టు గుర్తించారు. అక్కడ ఒమర్ షరీఫ్, గౌస్ సద్దాం, అబ్దుల్ హమీద్‌‌‌‌ను అరెస్ట్​ చేసి, విచారించగా.. అసలు కుట్రదారుడు ఖుస్రుద్ధీన్‌‌‌‌ అని బయటపడింది. అతన్నికూడా అరెస్టు చేసి, రూ.77 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. మరో ఐదుగురు పరారీలో ఉన్నారు.