న్యూఢిల్లీ: డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఇద్దరిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. మోసగాళ్లు పలువురు బాధితుల నుంచి రూ.100 కోట్లపైనే వసూలు చేశారు. నిందితులను అనీష్ సింగ్, మనీ సింగ్‌గా గుర్తించారు. ఒక మహిళను వీరు రెండు నెలల పాటు డిజిటల్ అరెస్టు చేసి లక్షలు దోచుకున్నారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను పట్టుకున్నారు. మోసగాళ్లు నిరుడు అక్టోబర్ 15న బాధితురాలికి ఫోన్ చేశారు.
‘‘మేము సీనియర్ పోలీసు ఆఫీసర్లం. మీరు మీ ఆధార్ కార్డులు వాడి పలు ఆర్థిక నేరాలకు పాల్పడినందుకు మిమ్మల్ని డిజిటల్ అరెస్టు చేస్తున్నాం” అని ఆమెను బెదిరించారు. తమకు సహకరించకపోతే బాధితురాలితో పాటు ఆమె భర్త, కొడుకుని కూడా నేరాల్లో ఇరికిస్తామని హెచ్చరించారు. బాధితురాలు ఎవరితోనూ మాట్లాడకూడదని, తమకు రోజూ రిపోర్టు చేయాలని చెప్పారు. అలా అక్టోబర్ 12 నుంచి డిసెంబర్ 12 మధ్య ఆమె నుంచి రూ.40 లక్షలు దోచుకున్నారు.
