ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ స్పీడప్..నాబార్డ్ నుంచి రూ.100 కోట్ల లోన్ రిలీజ్ 

ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ స్పీడప్..నాబార్డ్ నుంచి రూ.100 కోట్ల లోన్ రిలీజ్ 
  • కాంట్రాక్టర్ల పెండింగ్​ బిల్లులు చెల్లించిన అధికారులు 
  • 40 నియోజకవర్గాల్లో వేగంగా పనులు 
  • రెండేళ్లలో పూర్తి చేసేలా ప్లాన్
  • రూ.20,600 కోట్లు కావాలని ప్రభుత్వానికి రిపోర్ట్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ పాఠశాలల నిర్మాణానికి నోడల్ ఏజెన్సీగా ఉన్న టీజీఈడబ్ల్యూఐడీసీ(తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ విమెన్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్)కి రాష్ట్ర ప్రభుత్వ గ్యారెంటీతో నాబార్డ్ ఇటీవల రూ.100 కోట్ల లోన్ రిలీజ్​చేసింది. ఈ ఫండ్స్ తో కాంట్రాక్టర్లకు అధికారులు పెండింగ్ బిల్లులు చెల్లించారు. గతేడాది ఇంటిగ్రేటెడ్​స్కూళ్లకు ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ లో ఇంతవరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని కార్పొరేషన్​ఆఫీసర్లు చెబుతున్నారు. ఈ నెలతో ఆర్థిక సంవత్సరం పూర్తవుతున్న నేపథ్యంలో నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖను కోరుతున్నారు.

79 నియోజకవర్గాలకు స్కూళ్లు మంజూరు

రాష్ట్రవ్యాప్తంగా 105 నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్​రెసిడెన్షియల్​స్కూళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో పాఠశాలను​25 ఎకరాల్లో రూ.200 కోట్లతో నిర్మించేందుకు ప్లాన్​చేసింది. ఇప్పటికే 79 నియోజకవర్గాలకు ఇంటిగ్రేటెడ్​స్కూళ్లను మంజూరు చేసింది. వీటిలో 40 నియోజకవర్గాల్లో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో పనులను రెండేళ్లలో పూర్తి చేయాలని టెండర్లు దక్కించుకున్న కంపెనీలకు ప్రభుత్వం సూచించింది. ఈ పాఠశాలలకు 2026–----27 ఫైనాన్షియల్​ఇయర్​లో రూ.9,800 కోట్లు, 2027–28 ఫైనాన్షియల్​ఇయర్​లో  రూ.10, 800 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేసి, సర్కారుకు నివేదిక ఇచ్చారు.  

5వ తరగతి నుంచి ఇంటర్​వరకు..

యంగ్ ఇండియా ఇంటిగ్రేడెట్ రెసిడెన్షియల్ స్కూళ్లు ఓపెన్​అయితే.. ఒక్కో పాఠశాలలో 2,560 మంది విద్యార్థులు 5వ తరగతి నుంచి ఇంటర్​వరకు చదువుకోనున్నారు. స్కూళ్లలో వేర్వేరు బ్లాక్‌‌లు ఉంటాయి. ప్రతీ పాఠశాలలో 120 మంది టీచర్లు పని చేస్తారు. అలాగే, లైబ్రరీలో 5 వేల పుస్తకాలు, కంప్యూటర్‌‌ ల్యాబ్​లో 60 కంప్యూటర్లు ఉంటాయి. ఈ పాఠశాలల భవనాలు నిర్మించే ప్రాంతాల్లో 25 ఏళ్లుగా ఉష్ణోగ్రతలు, వర్షపాతం, చలి, వేడిగాలుల తీవ్రత తదితర వాతావరణ అంశాలను ఆర్కిటెక్చర్​సంస్థ పరిగణనలోకి తీసుకుంది. ప్రతీ డార్మెటరీ గదిలో 10 బెడ్‌‌లు, 2 బాత్‌‌రూమ్​లు ఉండేలా వాతావరణ అనుకూల భవనాలను డిజైన్​చేసింది. క్లాస్​రూమ్​లు, కంప్యూటర్‌‌ సెంటర్, లైబ్రరీ, ఆడిటోరియం, ఇండోర్‌‌ గేమ్స్, క్రికెట్, ఫుట్‌‌బాల్‌‌ మైదానాలు, బాస్కెట్‌‌బాల్, వాలీబాల్, టెన్నిస్‌‌ కోర్టులు, అవుట్‌‌డోర్‌‌ జిమ్, థియేటర్, ల్యాండ్‌‌స్కేప్‌‌ కోర్టుల వంటి సౌకర్యాలు ఉండనున్నాయి. 

ఫస్ట్​ ఫేజ్‌‌లో 19 చోట్ల.. 

మొదటి దశలో కొడంగల్, హుస్నాబాద్, హుజూర్‌‌నగర్, ములుగు, ఖమ్మం, కొల్లాపూర్, చాంద్రాయణగుట్ట, మంచిర్యాల, అచ్చంపేట, తిరుమలగిరి, మధిర, నల్గొండ, మంథని, పాలేరు, వరంగల్, అందోల్, భూపాలపల్లి, స్టేషన్‌‌ ఘన్‌‌పూర్, తుంగతుర్తి ప్రాంతాల్లో ఇంటిగ్రేటెడ్​ స్కూల్​ బిల్డింగ్​లు నిర్మిస్తున్నారు.