జాబ్స్ పేరుతో 2 వేల మందిని మోసం చేసిన వరంగల్ ఫ్యామిలీ

జాబ్స్ పేరుతో 2 వేల మందిని మోసం చేసిన వరంగల్ ఫ్యామిలీ
  • స్కౌట్స్ అండ్​ గైడ్స్ జాబ్స్ పేరుతో రూ.100కోట్ల స్కామ్
  • దేశవ్యాప్తంగా 2 వేల మంది బాధితులు  
  • వారిలో తెలంగాణ నుంచి 241 మంది..
  • లేని జాబ్స్ కు 15 రోజుల ట్రైనింగ్.. అపాయింట్ మెంట్ లెటర్స్
  • వరంగల్ కు చెందిన కిలాడీ ఫ్యామిలీ అరెస్ట్
  • పరారీలో ప్రధాన సూత్రధారి రాజ్ కేపీ సిన్హా

వరంగల్‍, వెలుగు: స్కౌట్స్ అండ్‍ గైడ్స్ ఆర్గనైజేషన్​ పేరుతో 3 రకాల ఫేక్‍ జాబ్స్​ క్రియేట్​ చేశారు. జాబ్‍ ఆధారంగా ఒక్కొక్కరి దగ్గర రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వసూలు చేశారు. 15 రోజులపాటు ట్రైనింగ్‍ కూడా ఇచ్చారు. ఫలానా స్కూళ్లో డ్యూటీ చేయాలంటూ ఫేక్‍ ఆర్డర్‍ కాపీలు చేతిలో పెట్టారు. ఉద్యోగం ముచ్చట ఇంట్లో, ఊళ్లో వారందరికి చెప్పి జాయిన్‍ అవుదామని సదరు స్కూల్స్​కు వెళ్లిన వారిని అక్కడి హెడ్‍మాస్టర్లు ‘హూ ఆర్‍ యూ?’ అనడంతో మోసపోయామని తెలుసుకుని తలలు పట్టుకున్నారు. స్కామ్ లో దేశ వ్యాప్తంగా 2 వేల మంది బాధితులు ఉండగా, వారిలో 241 మంది తెలంగాణ వారు ఉన్నారు. కొందరి ఫిర్యాదుతో కేసులు ఫైల్​చేసిన వరంగల్​జిల్లా పోలీసులు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. దాదాపు రూ.100 కోట్ల మోసం జరిగినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను వరంగల్​కమిషనర్​తరుణ్​జోషి   ప్రెస్​మీట్​పెట్టి వెల్లడించారు. 

జాబ్స్​ పోవడంతో..
హనుమకొండ జిల్లా శాయంపేట మండలం మైలారానికి చెందిన చల్లా వినయ్‍పాల్‍రెడ్డి 2009లో ములుగు జిల్లా బండారుపల్లిలో వీఆర్ఓగా పనిచేశాడు. అదే సమయంలో హనుకొండలోని వడ్డెపల్లికి చెందిన పోరిక అనసూయ ములుగు రెవెన్యూ డిపార్టుమెంట్​లో ఔట్‍సోర్సింగ్‍ ఎంప్లాయ్‍. ఇద్దరూ కొంత కాలం సహజీవనం చేశారు. తర్వాత పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరూ డ్యూటీ చేసేచోట నకిలీ దస్తావేజులు, డాక్యుమెంట్లు తయారుచేసి పట్టబడ్డారు. దాంతో 2012లో ఇద్దరి ఉద్యోగాలు పోయాయి. ఆ తర్వాత ‘స్కౌట్స్ అండ్‍ గైడ్స్’ ఫేక్​ ఆర్గనైజేషన్​ నడుపుతున్న ఢిల్లీకి చెందిన రాజ్‍ కేపీ సిన్హాతో వీరికి పరిచయం ఏర్పడింది. అతనితో కలిసి నిరుద్యోగ యువతను టార్గెట్​చేసి డబ్బు సంపాదించాలని స్కెచ్​వేశారు. రాజ్​కేపీ సిన్హా స్కౌట్స్​అండ్​గైడ్స్ కు ఇండియా మొత్తానికి కమిషనర్​అని, వినయ్‍పాల్‍రెడ్డి ఆంధ్రప్రదేశ్ కు, అనసూయ తెలంగాణకు కమిషనర్ అని, వారి కొడుకు నవీన్‍ సాకేత్‍ అసిస్టెంట్‍ కమిషనర్​ని అని నమ్మిస్తూ నిరుద్యోగులను మోసం చేయడం స్టార్ట్​చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న పలువురు వీఐపీలతో ఫొటోలు దిగినట్లు ఆఫీసుల్లో పెట్టారు. ‘ఆన్‍ గౌట్‍ డ్యూటీ’, ఎస్‍జీఓ రేడియం స్టిక్కర్లను ఖరీదైన కార్లకు​అతికించి నిజమైన కమిషనర్లుగా యువకులను నమ్మించారు. 

2019 నుంచి తెలుగు రాష్ట్రాల్లో..
2019 నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో తమ ప్లాన్​ను అమలు చేశారు. సంస్థ జిల్లా ఆర్గనైజేషన్‍ కమిషనర్‍, స్కౌట్‍ మాస్టర్‍, గైడ్‍ కెప్టెన్‍ అంటూ మూడు ఫేక్‍ జాబ్స్​క్రియేట్​చేశారు. డిజిగ్నేషన్​ఆధారంగా రూ. 3 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వసూలు చేశారు. అలా తెలంగాణకు చెందిన 241 మందికి వరంగల్‍, నల్గొండ జిల్లాల్లో15 రోజుల ట్రైనింగ్ ఇచ్చారు. మధ్యమధ్యలో కరోనా పేరుతో కొన్ని నెలలు టైం పాస్ చేశారు. చివరికి వరంగల్‍, నర్సంపేట, నెక్కొండ, హనుమకొండ, ములుగు, నల్గొండ, మంచిర్యాల, కరీంనగర్‍ జిల్లాల్లోని వివిధ గవర్నమెంట్​స్కూళ్లలో డ్యూటీలు చేయాలంటూ ఫేక్‍ అపాయిమెంట్‍ లెటర్లు ఇచ్చారు. వాళ్లంతా అక్కడికి వెళ్లాక పాఠశాలల్లో అలాంటి పోస్టులు ఏవీ లేవని హెడ్‍మాస్టర్లు చెప్పడంతో షాక్‍ అయ్యారు. మోసపోయినట్లు గ్రహించిన నిందితులు వినయ్, అనసూయ, నవీన్​సాకేత్​కు ఫోన్​చేసి నిలదీయగా రివర్స్​లో బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో కొందరు పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన టాస్క్​ఫోర్స్​టీం ముగ్గురినీ అరెస్టు చేసి విచారించింది. దాంతో స్కామ్​గురించి బయటపడింది. వారి నుంచి రెండు కార్లు, రూ.21.70లక్షలు, రెండు సెల్‍ఫోన్లు, నకిలీ ఐడీ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు విషయం తెలుసుకున్న బాధితులు వరంగల్​కమిషనరేట్‍కు క్యూ కట్టారు. ప్రధాన నిందితుడిని పట్టుకుని బాధితులకు న్యాయం చేస్తామని సీపీ భరోసా ఇచ్చారు.