
దేశ వ్యాప్తంగా అవినీతి రాజ్యమేలుతోంది. ప్రభుత్వ అధికారులు, పోలీసులు, ప్రజాప్రతినిధులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేతికందినకాడికి దోచుకుంటున్నారు. కోట్లు వెనకేసుకుంటున్నారు..చివరకు పోలీసులకు అడ్డంగా దొరుకుతున్నారు. లేటెస్ట్ గా అస్సాంలో ఓ టాప్ మహిళా అధికారిని ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఆమె ఇంట్లో కోట్ల విలువ చేసే నగదు,డబ్బును స్వాధీనం చేసుకున్నారు.
2019లో అస్సాం సివిల్ సర్వీస్‌లో చేరిన గోలాఘాట్ నివాసి నూపుర్ బోరా సీఎం విజిలెన్స్ సెల్ అధికారుల బృందంలో పనిచేస్తున్నారు. బార్పేటలోని రెవెన్యూ సర్కిల్ లో పనిచేసినపుడు వివాదాస్పద భూమిలో నూపుర బోరా ప్రమేయం ఉందనే ఆరోపణలు వచ్చాయి. డబ్బుకు బదులుగా ఆమె భూమిని లంచంగా తీసుకుందనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ గత ఆరు నెలలుగా ఆమెపై నిఘా ఉంచారు.
ఈ మేరకు సెప్టెంబర్ 15న పోలీసులు గౌహతిలోని నూపుర్ బోరా ఇంటిపై దాడి చేసి కోటి రూపాయల విలువైన బంగారు అభరణాలతో పాటు రూ.92 లక్షల నగదును పట్టుకున్నారు. బార్పేటలోని ఆమె అద్దె ఇంట్లో జరిగిన దాడిలోనూ రూ.10 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.
బార్పేటలోని రెవెన్యూ సర్కిల్ కార్యాలయంలో పనిచేస్తున్న ఆమె సహాయకుడు లాట్ మండల్ సూరజిత్ డేకా నివాసంపై కూడా స్పెషల్ విజిలెన్స్ సెల్ దాడి చేసింది. బార్పేటలో సర్కిల్ ఆఫీసర్‌గా ఉన్నప్పుడు నూపుర్ బోరాతో కలిసి బార్పేటలో భారీగా ఆస్తులు కూడగట్టారని అతడిపై ఆరోపణలు ఉన్నాయి.