కొత్త ఉద్యోగుల జీతాల కోసం రూ.2 వేల కోట్లు

కొత్త ఉద్యోగుల జీతాల కోసం రూ.2 వేల కోట్లు
  • ఉద్యోగాల ప్రకటనలతో బీజేపీ, కాంగ్రెసోళ్లు బేజారైపోయిండ్రు 
  • తక్కువ అప్పులు చేసిన రాష్ట్రాల్లో తెలంగాణది ఐదో స్థానం: హరీశ్​రావు

హైదరాబాద్, వెలుగు: కొత్తగా ఉద్యోగాలు పొందే వారి జీతాల కోసం బడ్జెట్​లో రూ.2 వేల కోట్లు కేటాయించామని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావు వెల్లడించారు. మూడు నెలలకు కొన్ని, ఆర్నెళ్లకు కొన్ని, ఎనిమిది నెలలకు మరికొన్ని పోస్టులు విడతలవారీగా భర్తీ చేస్తామని చెప్పారు. పోస్టులన్నీ  ఒకేసారి భర్తీ చేయకపోవడం వల్ల బడ్జెట్ సమస్య రాకపోవచ్చన్నారు. కౌన్సిల్ లో గురువారం బడ్జెట్​పై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు  ఆయన సమాధానమిచ్చారు.

బిశ్వాల్ కమిటీ రిపోర్టులో తప్పుడు లెక్కలు
పీఆర్సీ కోసం నియమించిన బిశ్వాల్​ కమిటీ వైద్య విధాన పరిషత్, సోషల్, బీసీ, ట్రైబల్,  మైనార్టీ వెల్ఫేర్​ డిపార్ట్​మెంట్లలోని 54 వేల ఉద్యోగాలను పరిగణనలోకి తీసుకోలేదన్నారు. ఆ కమిటీ రిపోర్టులో తప్పుడు లెక్కలు ఉన్నాయన్నారు. దేశ చరిత్రలో ఒకేసారి ఇన్ని పోస్టులను ప్రకటించిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు.  9, 10వ షెడ్యూల్​లోని సంస్థల విభజన పూర్తయితే మరో 10  వేల నుంచి  20 వేల ఉద్యోగాలు వస్తాయన్నారు. దేశంలో 15  లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, ఆ పోస్టులు భర్తీ చేస్తే మన రాష్ట్రానికి 50 వేల ఉద్యోగాలు వస్తాయని, బీజేపీ నాయకులకు దమ్ముంటే ఆ పోస్టులు భర్తీ చేయించాలన్నారు. వ్యవసాయం, కరెంట్, మైనార్టీ సంక్షేమం కోసం పదేళ్ల కాంగ్రెస్​ పాలనలో పెట్టిన ఖర్చు టీఆర్​ఎస్​ ప్రభుత్వం కేవలం ఒక్క ఏడాదిలోనే చేసిందన్నారు. ఎరువుల కోసం క్యూలైన్లు, కరెంట్ కష్టాలు రాష్ట్రంలో లేవన్నారు. రైతు బంధు ఇచ్చి మిగతా స్కీమ్ లన్ని బంద్ చేశారని ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. రాష్ట్రం ఏర్పడిన సమయంలో కేవలం 84  గ్రామపంచాయతీల్లోనే  ట్రాక్టర్లు ఉండేవని, ఇప్పుడు ట్రాక్టర్​లేని జీపీ లేదన్నారు. దేశంలో అప్పులు తక్కువ చేసిన రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ఐదో స్థానంలో ఉందని, ఎఫ్​ఆర్​బీఎం పరిమితులకు లోబడే అప్పులు చేస్తున్నామని తెలిపారు. సంపద పెంచడంలో దేశానికే మన రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని, ప్రస్తుతం స్టేట్​ ఓన్ ట్యాక్స్​ రెవెన్యూ లక్ష కోట్లు దాటిందని వెల్లడించారు. 

యూనివర్సిటీ కాంట్రాక్ట్ లెక్చరర్లకు ఫిట్మెంట్ వర్తింపజేయాలి
రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లకు పీఆర్సీ, 30 శాతం ఫిట్​ మెంట్ వర్తింపజేయాలని ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి మండలిలో హరీశ్​ రావు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై మంత్రి  స్పందిస్తూ  రాష్ట్రంలో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ ఫిట్​మెంట్, పీఆర్సీ వర్తింపజేశామని, యూనివర్సిటీ కాంట్రాక్ట్ లెక్చరర్ల వివరాలు 
కూడా తెప్పించుకుని న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.