- 2025 మే వరకు కమ్యూటేషన్ పెండింగ్ బిల్లులు క్లియర్
- ఇచ్చిన మాట ప్రకారం వంద రోజుల్లో రూ.6 వేల కోట్లు చెల్లించేలా ముందుకు
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగుల దీర్ఘకాలిక బకాయిల చెల్లింపుల్లో భాగంగా తొలి విడతగా రూ. 2వేల కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గతంలో ఉద్యోగ జేఏసీ నాయకులకు ఇచ్చిన హామీ మేరకు వంద రోజుల్లో మొత్తం రూ. 6 వేల కోట్ల పెండింగ్ బిల్లులను చెల్లించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. తాజా నిధుల కేటాయింపుతో రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించిన కీలకమైన ఆర్థిక బకాయిలు చాలా వరకు క్లియర్ అయ్యాయి.
విశ్రాంత ఉద్యోగుల జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జీపీఎఫ్) బకాయిలను వంద శాతం చెల్లించడంతో పాటు 2025 మే వరకు పెండింగ్‌లో ఉన్న కమ్యూటేషన్ బకాయిలన్నింటినీ ప్రభుత్వం ఈ విడతలోనే సర్దుబాటు చేసింది. క్రమబద్ధమైన ఆర్థిక కార్యాచరణతోనే నిధుల విడుదల సాధ్యమైందని ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు.
- త్వరలోనే రూ.4 వేల కోట్లు
ప్రభుత్వం ప్రకటించిన కాలపరిమితిలోనే మిగిలిన రూ.4 వేల కోట్ల బకాయిలను కూడా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడానికి అధికారులు కసరత్తు ప్రారంభించారు. బకాయిల విడుదలకు సంబంధించిన తదుపరి విడతల ప్రణాళికలపై ఆర్థిక శాఖ దృష్టి పెట్టింది. చాలా కాలంగా నిలిచిపోయిన ఆర్థికపరమైన పెండింగ్ బిల్లుల సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారమవుతుండటం పట్ల ఉద్యోగ సంఘాల నాయకులు, రిటైర్డ్ ఉద్యోగులు సానుకూలంగా స్పందిస్తున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంపై ఉద్యోగ వర్గాల నుంచి మంచి స్పందన వస్తుండగా, మిగిలిన నిధులను కూడా ఇదే తరహాలో గడువులోగా విడుదల చేయాలని పలు ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి.
- పెండింగ్ బిల్స్ రిలీజ్ పై ఉద్యోగుల జేఏసీ హర్షం
ఉద్యోగుల రూ.6 వేల కోట్ల బకాయిల్లో భాగంగా తొలి విడతగా రూ.2 వేలు కోట్లు విడుదల చేయడంపై టీజీఈ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. వంద రోజుల్లో మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎస్ రామకృష్ణరావులకు ధన్యవాదాలు తెలుపుతూ, మిగిలిన రూ.4 వేల కోట్లు కూడా ప్రభుత్వం విడుదల చేస్తుందన్న నమ్మకం ఉందని పేర్కొన్నారు.
