- రూ.262.51 కోట్లు చెల్లింపు: హౌసింగ్ ఎండీ గౌతం
హైదరాబాద్, వెలుగు: సుమారు 23 వేల మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు సోమ, మంగళవారాల్లో రూ. 262.51 కోట్ల రికార్డు సాయాన్ని ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఈ మొత్తాన్ని ఆధార్ నంబరు ఆధారంగా లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేసినట్లు హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతం తెలిపారు. ఈ వారం చేసిన చెల్లింపుల్లో, బేస్ మెంట్ స్థాయి నిర్మాణపు పనులను పూర్తిచేసిన లబ్ధిదారులు 2,763 ఉండగా.. గోడలు - శ్లాబ్ కట్టడాల స్థాయి దాటిన వారు 20,186 ఉన్నారని వివరించారు.
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రతి సోమవారం బిల్లులను విడుదల చేస్తున్నారు. అందులో భాగంగా ఈ ఏడాది మార్చి నాటికల్లా ఒక లక్ష ఇండ్లను పూర్తి చేయడంతోపాటు తదుపరి దశను ప్రారంభించడానికి ప్రభుత్వ యంత్రాంగం సన్నద్ధమవుతున్నదని ఎండీ చెప్పారు. మార్గదర్శకాలకు తగ్గట్టు(400- నుంచి 600 చదరపు అడుగుల విస్తీర్ణం మొదలైనవి) ఇండ్లు కట్టుకుంటున్న వారందరికీ బిల్లులు సకాలంలో విడుదల అవుతున్నాయన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటిదాకా 2.50 లక్షల ఇండ్ల పనులు ప్రారంభమయ్యాయని, వీటిలో సుమారు 1.25 లక్షల ఇండ్లు గోడలు, శ్లాబ్ లు అయిపోయి త్వరలోనే పూర్తి కానున్నాయని గౌతం తెలిపారు. మరో 75 వేల ఇండ్ల పనులు బేస్ మెంట్ స్థాయిని దాటాయని వెల్లడించారు. ఇందిరమ్మ ఇండ్ల పనుల పురోగతిని కలెక్టర్లు తనిఖీలు చేస్నున్నారని, సమీక్షలు నిర్వహిస్తూ నిరంతరం పర్యవేక్షిస్తున్నారని వివరించారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇప్పటిదాకా మొత్తం రూ. 4,351 కోట్లకు పైగా నిధులను లబ్ధిదారులకు విడుదల చేశామని ఎండీ గౌతం పేర్కొన్నారు.
