
- రూ. 14 భరించనున్న జీహెచ్ఎంసీ
- సీఎస్ఆర్ కింద చెరువుల అభివృద్ధి
- 14 అంశాలకు స్టాండింగ్ కమిటీ గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో గురువారం స్టాండింగ్ కమిటీ సమావేశం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలతో పాటు రెండు టేబుల్ ఐటమ్స్‌కు సభ్యులు ఆమోదం తెలిపారు. ఇందులో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, స్టాండింగ్ కమిటీ సభ్యులు బొంతు శ్రీదేవి, బానోతు సుజాత, మహాలక్ష్మి రమన్ గౌడ్, సీఎన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రధానంగా హరేకృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ద్వారా ఇందిరమ్మ క్యాంటీన్ లో బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ప్రవేశ పెట్టడానికి కమిటీ సభ్యులు ఆమోదం తెలిపారు. ఈ బ్రేక్‌ఫాస్ట్‌కు రూ.19 - ఖర్చవుతుండగా, లబ్ధిదారుడి నుంచి రూ. 5 తీసుకోనున్నారు. మిగతా రూ.14 జీహెచ్ఎంసీ నుంచి ఇచ్చేందుకు ఆమోదించారు.
ఈ బ్రేక్ ఫాస్ట్ స్కీం కోసం బల్దియా ఏడాదికి రూ.15.33 కోట్లు ఖర్చు చేయనున్నది. ఈ క్యాంటీన్లకు అవసరమైన10 ఫీట్ల పొడవు, 40 ఫీట్ల వెడల్పుతో కూడిన 60 కంటైనర్లు, 10/20 ఫీట్లతో 79 కంటైనర్లు, 11 పాత క్యాంటీన్ సెంటర్ల వద్ద మార్పులు చేసేందుకు రూ. 11.43 కోట్లు ఖర్చు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నెలలో రూ.3 కోట్లు, ఆగస్టు మొదటి వారంలో రూ.4 కోట్లు, చివరి వారంలో రూ.4.43 కోట్లు చెల్లించనున్నారు. సెంటర్ల వద్ద వాటర్ కనెక్షన్, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజీ కనెక్షన్ ఇవ్వాలని హెచ్ కేఎం ఫౌండేషన్ కోరగా ఓకే చెప్పారు.
హైడ్రా నుంచి అద్దె వసూలు
నగరంలోని చెరువులను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద డెవలప్ చేసేందుకు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. సరూర్‌నగర్‌లోని ట్యాంక్ బండ్ రిపేర్లకు, కట్ట బలోపేతం కోసం రూ.5.60 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టేందుకు షార్ట్ టెండర్ పిలవడానికి పరిపాలన అనుమతికి ఆమోదించారు.
అలాగే, బుద్ధ భవన్ ను హైడ్రా ఆఫీసుకు 2027 వరకు లీజుకు ఇవ్వడానికి ఆమోదించారు. ఇదే భవనంలోని ఫోర్త్ఫ్లోర్లో తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కు 2028 వరకు లీజుకు ఇవ్వడానికి ఆమోదించారు. గ్రేటర్ లో ఇటీవల నిర్మించిన 23 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలను ఐదేండ్ల పాటు నిర్వహించడానికి టెండర్లను పిలవడానికి ఓకే చెప్పారు. దీని కోసం ఏడాదికి రూ.13.59 కోట్లు ఖర్చు చేసేందుకు గ్రీన్సిగ్నల్ఇచ్చారు.
అధికారాల బదలాయింపు..
ఉద్యోగుల రిటైర్ మెంట్ బెనిఫిట్స్, ఫించన్ వంటి అంశాల్లో కమిషనర్ కు ఉన్న అధికారాలను అడిషనల్ కమిషనర్(అడ్మిన్), అడిషనల్ కమిషనర్ (ఫైనాన్స్)కు బదాలయించేందుకు ఆమోదించారు. దీంతోపాటు టౌన్ ప్లానింగ్ విభాగంలోనూ పలు అధికారాలను బదలాయించారు. ఇన్ స్టంట్రిజిస్ట్రేషన్/ఇన్ స్టంట్అప్రూవల్ విషయంలో నిర్ణీత సమయంలో సరైన డాక్యుమెంట్లు సమర్పించకపోతే ఆ పర్మిషన్ రద్దు చేసే అధికారం కమిషనర్ కు మాత్రమే ఉండేది. దీన్ని జోనల్, డిప్యూటీ కమిషనర్లకు అప్పగించేందుకు కమిటీ ఆమోదించింది. ఇలా మొత్తం 14 అంశాలతో పాటు రెండు టేబుల్ ఐటమ్ లకు సభ్యులు ఆమోదించారు.
జీహెచ్ఎంసీ ఆఫీసుల్లో మీడియాపై ఆంక్షలు?
జీహెచ్ఎంసీ ఆఫీసుల్లో మీడియాపై ఆంక్షలు విధించనున్నట్లు సమాచారం. బల్దియా సర్కిల్, జోనల్ ఆఫీసులతో సహా హెడ్ ఆఫీసులోనూ మీడియా ఆంక్షలపై గురువారం జరిగిన స్టాండింగ్ కమిటీలో చర్చ జరిగింది. కొందరు రిపోర్టర్లు టౌన్ ప్లానింగ్ అధికారులను బెదిరిస్తున్నారని అధికారులు.. మేయర్, కమిషనర్ దృష్టి కి తీసుకువచ్చారు. ఇదే అంశంపై 15 రోజుల కింద సెంట్రల్ జోన్ డీసీపీకి ఖైరతాబాద్ టౌన్ ప్లానింగ్ కు చెందిన అసిస్టెంట్ సిటీ ప్లానర్ ఫిర్యాదు చేశారని చెప్పారు.
ఈ నేపథ్యంలో సర్కిల్, జోనల్ ఆఫీసుల్లో మీడియాను పూర్తిగా అనుమతించొద్దని, సర్కిల్, జోనల్ఆఫీసుల నుంచి వారానికోసారి ప్రెస్ రిలీజ్ మాత్రమే ఇచ్చేందుకు నిర్ణయించినట్లు తెలిసింది. హెడ్ ఆఫీసులో మాత్రం సీపీఆర్ఓ సెక్షన్ వరకు మాత్రమే అనుమతించాలని స్టాడింగ్ కమిటీ లో చర్చించినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన మూడు, నాలుగు రోజుల్లో తీర్మానించనున్నట్టు తెలిసింది.