మక్క రైతులకు రూ. 500 కోట్ల నష్టం

మక్క రైతులకు రూ. 500 కోట్ల నష్టం
  • తక్కువ ధరకు కొనేందుకు వ్యాపారుల మోఖా
  • వానాకాలం సీజన్ లో రాష్ట్రంలో 2.25 లక్షల ఎకరాల్లో సాగు
  • 7.65 లక్షల  రాబడి రావొచ్చని అంచనా

హైదరాబాద్, వెలుగు: మక్క పంటను కొనేది లేదని సీఎం తేల్చిచెప్పడంతో ఆ పంట పండించిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఇదే అదునుగా వ్యాపారులు తక్కువ ధరకు మక్కలు కొనుగోలు చేసేందుకు అవకాశం ఏర్పడింది. వానాకాలం సీజన్‌‌లో రాష్ట్ర వ్యాప్తంగా 2.25 లక్షల ఎకరాల్లో రైతులు మక్క పంట సాగు చేశారు. 7.65 లక్షల టన్నుల పంట దిగుబడి రావొచ్చని ఆఫీసర్లు  అంచనా వేశారు. ఇప్పటికే మక్క పంట కోతలు మొదలయ్యాయి. యేటా మార్క్‌‌ఫెడ్‌‌ ద్వారా మక్కలు కొనుగోలు చేస్తున్నారు. షరతుల సాగులో భాగంగా ప్రభుత్వం వానాకాలంలో మక్క పంట వేయొద్దని రైతులను హెచ్చరించింది. అయినా కొందరు రైతులు స్థానిక పరిస్థితులను బట్టి మక్కలు సాగు చేయడంతో ప్రభుత్వం వారి పంటను కొనలేమని చెత్తులేసింది.

ఆందోళనలో రైతులు

మక్కలు క్వింటాల్‌‌ మద్దతు ధర రూ.1,850 ఉండగా.. ఈసారి మార్క్‌‌ఫెడ్‌‌ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు వ్యాపారులకే తమ పంట అమ్ముకోవాల్సి వస్తున్నది. వ్యాపారులు క్వింటాల్‌‌ మక్కలకు రూ. వెయ్యికి మించి ఇవ్వలేమని తేల్చేస్తున్నారు. సీఎం తాజా నిర్ణయంతో వ్యాపారులు ధర మరింత తగ్గించే అవకాశం ఉంది. దీంతో మొత్తంగా రైతులు రూ. 500 కోట్లు నష్టపోయే ప్రమాదం ఉంది. తమది రైతు ప్రభుత్వమని చెప్పుకునే సీఎం..  మక్కలను కొనుగోలు చేయబోనని చెప్పడంతో పంటను ఏం చేయాలని రైతులు ఆందోళన చెందుతున్నారు.