ఇంటర్​ పాసైతే నెలకు రూ.6 వేలు..మహారాష్ట్రలో నిరుద్యోగ యువకులకు కొత్త స్కీం

ఇంటర్​ పాసైతే నెలకు రూ.6 వేలు..మహారాష్ట్రలో నిరుద్యోగ యువకులకు కొత్త స్కీం
  • డిప్లొమా, ఐటీఐ వాళ్లకు 8 వేలు, 
  • డిగ్రీ, పీజీ వాళ్లకు 10 వేలు
  • మహారాష్ట్రలో నిరుద్యోగ యువకులకు కొత్త స్కీం

ముంబై: మహారాష్ట్రలో నిరుద్యోగ యువకులకు ఆర్థిక సాయం, స్కిల్​ ట్రైనింగ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త స్కీం తీసుకొచ్చింది. బుధవారం పండరీపురంలో ఆషాఢి ఏకాదశి సందర్భంగా ‘లాడ్లా భాయ్ యోజన” పేరిట మహారాష్ట్ర సీఎం ఏక్​నాథ్​ షిండే ఈ స్కీం ప్రారంభించారు. ఈ కొత్త స్కీం కింద నిరుద్యోగ యువకులకు ఆర్థిక సాయం అందించనున్నట్లు చెప్పారు. వారివారి విద్యార్హతల ప్రకారం ప్రతి నెల బ్యాంకు ఖాతాల్లో స్టైంపెడ్ జమ చేయనున్నారు.

18- నుంచి 35 ఏండ్లున్న వారు ఈ స్కీంకు అర్హులు. 12వ క్లాస్ (ఇంటర్​) పాసైన వారి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన వారి వరకు అర్హులు. ఈ స్కీంలో భాగంగా ఇటర్న్​షిప్ ​కింద వివిధ అంశాల్లో స్కిల్స్ పెంచుకునేందుకు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తారు. ఆరు నెలల ఇంటర్న్​షిప్ కాలంలో అర్హులైన వారికి నేరుగా వారి బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ అవుతాయి. ఇంటర్ పాసైన వారికి నెలకు రూ.6వేలు, ఐటీఐ/ డిప్లొమా పూర్తి చేసిన వారికి నెలకు రూ.8 వేలు, డిగ్రీ/పీజీ పూర్తి చేసిన వారికి రూ.10 వేలు చొప్పున స్టైపెండ్ చెల్లించనున్నారు. 

ఇప్పటికే యువతులకు ‘లాడ్లీ బెహన్​ స్కీం’ అమలు చేస్తున్నారు. మహారాష్ట్రలో అక్టోబర్-–నవంబర్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త స్కీం తెచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.