రైతు భరోసా కింద రూ.6,590 కోట్లు జమ : మంత్రి తుమ్మల

రైతు భరోసా కింద రూ.6,590 కోట్లు జమ : మంత్రి తుమ్మల
  •     నాలుగు రోజుల్లోనే 65.76 లక్షల మంది రైతులకు లబ్ధి
  •     మరోసారి రికార్డు సృష్టించిన రాష్ట్ర సర్కార్: మంత్రి తుమ్మల

హైదరాబాద్, వెలుగు: రైతు భరోసా నిధులను రైతు ల బ్యాంక్‌‌ ఖాతాల్లో జమ చేయడంలో రాష్ట్ర సర్కార్ మరోసారి రికార్డు సృష్టించిందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. నిధుల పంపిణీ కార్యక్రమం మొదలైన 4 రోజుల్లోనే రూ.6,590.37 కోట్లను జమ చేసినట్టు ఆయన వెల్ల డించారు. ప్రభుత్వం శుక్రవారం నాలుగో విడత రైతు భరోసా నిధులను విడుదల చేసింది. 4 నుంచి 5 ఎకరాల సాగుభూమి ఉన్న రైతుల ఖాతాల్లో రూ.1,188 కోట్లను జమ చేసింది. ఈ విడతలో రాష్ట్రవ్యాప్తంగా 4.41 లక్షల మంది రైతులు లబ్ధి పొం దారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇప్పటివరకు 65.76 లక్షల మంది రైతులకు రైతు భరోసా అందించామన్నారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా డబ్బుని నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు.  ఇప్పటికే మూడు విడతల్లో 4 ఎకరాల్లోపు సాగుభూమి కలిగిన రైతులందరికీ రైతుభరోసా సాయం అందించామని మంత్రి పేర్కొన్నారు.