గ్రామీణ రోడ్లకు 74 కోట్లు మంజూరు..పీఆర్ ఇంజినీరింగ్ శాఖ ఉత్తర్వులు

గ్రామీణ రోడ్లకు 74 కోట్లు మంజూరు..పీఆర్ ఇంజినీరింగ్ శాఖ ఉత్తర్వులు

హైదరాబాద్, వెలుగు:  గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల రవాణా సౌలతులను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. వివిధ జిల్లాల్లోని 32 రోడ్ల పనులు చేపట్టేందుకు రూ.74.43 కోట్ల అంచనా వ్యయంతో పరిపాలనా అనుమతిని మంజూరు చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ఇంజినీరింగ్ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.  

పంచాయతీరాజ్ ఇంజినీర్- ఇన్ -చీఫ్ ప్రతిపాదనల మేరకు 2025~26 ఆర్థిక సంవత్సరానికి గ్రామీణాభివృద్ధి, రోడ్ల నిర్మాణం కోసం నిధులు కేటాయించారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా 32 పనుల్లో సింహభాగం ములుగు జిల్లాకే మంజూరు కావడం విశేషం. ఈ జిల్లాలో మొత్తం 23 రోడ్డు పనులకు అనుమతి లభించింది.  గ్రామీణ రహదారులు పల్లె ప్రజల జీవితాల్లో కీలకమైన పాత్ర పోషిస్తాయని, కొత్త రహదారుల నిర్మాణంతో రవాణా సౌకర్యం మెరుగుపడటమే కాకుండా స్థానిక ఆర్థిక వ్యవస్థ  బలపడుతుందని సీతక్క పేర్కొన్నారు.