మూడు నెలల్లో రూ. 8 వేల కోట్ల అప్పు

మూడు నెలల్లో రూ. 8 వేల కోట్ల అప్పు
  • ఆర్బీఐ నుంచి తీసుకునేందుకు రెడీ అయిన రాష్ట్ర సర్కార్

హైదరాబాద్, వెలుగు: ఆర్థిక సంవత్సరం ఇట్ల మొదలైందో లేదో అట్ల అప్పులకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ అయింది. ఈ నెలలో రూ. రెండు వేల కోట్లు అప్పుగా తీసుకోవాలని నిర్ణయించింది.  ఇందులో 15న రూ. వెయ్యి కోట్లు, 27న వెయ్యి కోట్లు తీసుకోనుంది. ఆర్బీఐ ప్రతి నెల నిర్వహించే వేలం పాటలో బాండ్ల అమ్మకానికి రాష్ట్ర ప్రభుత్వం అప్లయ్​ చేసుకోగా.. మొదటి త్రైమాసికంలో అంటే జూన్ లోపు మొత్తం రూ.  8 వేల కోట్లు అప్పు చేసేందుకు ఆర్బీఐ అనుమతి ఇచ్చింది. ఏప్రిల్ లో రెండు వేల కోట్లు, మేలో మూడు వేల కోట్లు, జూన్​లో మూడు వేల కోట్ల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐ నుంచి అప్పు తీసుకోనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ. 47,500 కోట్ల అప్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్ నుంచి ప్రభుత్వ ఉద్యోగుల జీతాల పెంపు అమల్లోకి రావడంతో ప్రతినెల అదనంగా సుమారు వెయ్యి కోట్ల భారం పడుతోందని ఆర్థిక శాఖ వర్గాలు అంటున్నాయి. గత ఆరేండ్లుగా చేసిన అప్పులకు కిస్తీల చెల్లింపుల భారం కూడా పెరిగిందని, నిరుడు ప్రతి నెల కిస్తీల భారం రూ. 1,300 కోట్లు ఉండేదని, ఈ ఫైనాన్సియల్ ఇయర్​లో ఆ భారం రూ. రెండు వేల కోట్లకు చేరనుందని అధికారులు అంచనా వేశారు. వీటి కోసం మళ్లీ అప్పులు చేయక తప్పేలా లేదని అంటున్నారు. 

ఇప్పటికే రూ. 4 లక్షల కోట్ల అప్పు
రాష్ట్ర ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు సుమారు రూ. 4 లక్షల కోట్ల అప్పు అయింది. ఇందులో ప్రభుత్వం నేరుగా తీసుకున్న అప్పు రూ. రెండున్నర లక్షల కోట్లు ఉంటుంది. మిగతా అప్పు వివిధ కార్పొరేషన్ల ద్వారా తీసుకుంది. ఏటేటా అప్పులు భారీగా తీసుకోవడం, తర్వాత వాటిని తిరిగి కట్టేందుకు, వడ్డీలకే ఎక్కువ మొత్తంలో రాష్ట్ర సర్కార్​ ఖర్చు చేస్తోంది. 2020–-21 బడ్జెట్​లో 17.69 శాతం నిధులను కిస్తీల చెల్లింపులకు కేటాయించింది.