నో హెల్మెట్.. ఆరు నెలల్లో రూ. 86 కోట్ల ఫైన్లు

నో హెల్మెట్.. ఆరు నెలల్లో రూ. 86 కోట్ల ఫైన్లు
  • హెల్మెట్ పెట్టుకోనోళ్లకు ఆరు నెలల్లో ఫైన్లు 85.77 కోట్లు
  • 63.47 లక్షల కేసులు నమోదు.. ఇవన్నీ గ్రేటర్ హైదరాబాద్‌‌లోనే
  • సర్వీస్ చార్జీల కిందే రూ.22.21 కోట్లు వసూలు

హైదరాబాద్‌‌, వెలుగు: హెల్మెట్ లేకుండా బైకులు నడిపేటోళ్లను కెమెరాలు వెంటాడుతున్నాయి. రూల్స్​ పాటించకుండా రోడ్డెక్కితే చాలు ట్రాఫిక్ పోలీసులు కెమెరాలతో రెడీగా ఉంటున్నారు. సీసీ కెమెరాలూ వదలడం లేదు. ఇలా హెల్మెట్ లేని బైకర్లకు ఏటా లక్షల్లో చలానాలు, కోట్లలో జరిమానాలు విధిస్తున్నారు. ఈ ఆరు నెలల్లోనే 63.47 లక్షల కేసులు నమోదు కాగా.. సుమారు రూ.85.77 కోట్ల జరిమానాలు జనరేట్ అయ్యాయి. ఈ చలానాలే ఖజానాకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి.

కానిస్టేబుల్స్‌‌కి డైలీ టార్గెట్స్
బైక్‌‌ నడుపుతున్న వ్యక్తితోపాటు వెనుక కూర్చున్న వ్యక్తి హెల్మెట్‌‌ తప్పనిసరిగా పెట్టుకోవాలని పోలీసులు చెబుతున్నారు. ఇద్దరిలో ఏ ఒక్కరికి హెల్మెట్‌‌ లేకున్నా ట్రాఫిక్ పోలీసులు కేసులు రిజిస్టర్ చేస్తున్నారు. ఇలా హైదరాబాద్, సైబరాబాద్‌‌, రాచకొండ పోలీసులు పోటీ పడి చలాన్స్ విధిస్తున్నారు. పాయింట్‌‌ డ్యూటీలో ఒక్కో ట్రాఫిక్‌‌ కానిస్టేబుల్‌‌కు టార్గెట్లు విధిస్తున్నారు. ఒక్కో కానిస్టేబుల్ రోజూ 250 ఫొటోలు తీస్తున్నారు. వాటిని టీఎస్‌‌ పోలీస్‌‌ ఈ చలాన్‌‌ పోర్టల్‌‌లో అప్‌‌లోడ్‌‌ చేస్తున్నారు. సిటీ రోడ్లపై సీసీటీవీ కెమెరాలు హెల్మెట్‌‌ లేని వాహనదారుల బండి నంబర్‌‌‌‌ క్యాప్చర్ చేస్తున్నాయి.

సర్వీస్‌‌ చార్జీలు రూ. కోట్లలోనే
సీసీటీవీ కెమెరాలు, డిజిటల్ కెమెరాలతో ఫొటోలు తీస్తే.. రూ.100తోపాటు నాన్‌‌ కాంటాక్ట్‌‌ కేసుల కింద రూ.35 సర్వీస్ చార్జ్‌‌ తప్పనిసరి చేశారు. మొత్తం రూ.135 చలానా విధిస్తున్నారు. పోలీసులు నిర్వహించే స్పెషల్ డ్రైవ్‌‌లో స్పాట్ చలానాలు విధిస్తున్నారు. అక్కడ రూ.100 వసూలు చేస్తున్నారు. రూ.35 లెక్కన -సర్వీస్ చార్జీలే రూ.22.21 కోట్లు దాకా ఉన్నాయని పోలీసు శాఖ లెక్కలు చెబుతున్నాయి. పెండింగ్‌‌ ట్రాఫిక్ ఫైన్లు వసూలు చేసేందుకు నెల రోజులుగా పోలీసులు స్పెషల్‌‌ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. లాక్‌‌డౌన్ కేసులతో పాటు ట్రాఫిక్ రూల్స్‌‌ బ్రేక్ చేసిన వాహనదారుల నుంచి జరిమానాలు వసూలు చేస్తున్నారు. రోజూ ట్రాఫిక్ ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌ ముగిసిన తర్వాత ఉదయం 11 నుంచి సాయంత్రం 4.30 గంటల దాకా బండ్లు చెక్ చేస్తున్నారు. బైకులు, కార్లు, హెవీ మోటార్‌‌‌‌ వెహికల్స్‌‌పై పెండింగ్‌‌ చలానాలు వసూలు చేస్తున్నారు. చలానాలు చెల్లించని వెహికల్స్ సీజ్ చేస్తున్నారు. ఇలా ఈ ఏడాది నమోదైన కేసుల్లో సుమారు 45 శాతం పెండింగ్ చలాన్స్‌‌ క్లియర్ చేశారు.

‘‘ట్రాఫిక్‌‌ కేసుల్లో హెల్మెట్‌‌ వయొలేషన్‌‌వి ఎక్కువగా రిజిస్టర్ అవుతున్నాయి. సిటీలో 6 నెలల్లో 173 యాక్సిడెంట్లు జరిగాయి. ప్రమాదాల్లో తలకు గాయాలై బైక్‌‌ రైడర్స్‌‌ చనిపోతున్నారు. హెల్మెట్‌‌ లేకుండా బండి నడపడం ప్రమాదకరం. ఓవర్‌‌‌‌ స్పీడింగ్‌‌తో ఈ ఏడాది 95 మంది చనిపోయారు’’
- అనీల్‌‌ కుమార్, జాయింట్‌‌ సీపీ, ట్రాఫిక్, హైదరాబాద్‌‌

జనవరి నుంచి ఈ నెల 26 వరకు హెల్మెట్ లేకుండా బైక్ నడిపినోళ్లపై నమోదైన కేసులు, జరిమానాలు
కమిషనరేట్    కేసులు    జరిమానాలు (రూ.ల్లో)
హైదరాబాద్    25,43,897    25,43,89,700
సైబరాబాద్    28,68,602    28,68,60,200
రాచకొండ    9,34,715    9,34,71,500
మొత్తం    63,47,214    63,47,21,400