టెన్త్​ కేసులో స్పీడు..టీఎస్​పీఎస్సీ కేసులో ఏమైంది?

టెన్త్​ కేసులో స్పీడు..టీఎస్​పీఎస్సీ కేసులో ఏమైంది?
  • బండి సంజయ్​పై పీడీ యాక్ట్​ పెట్టాలి
  • ఆయనను అరెస్ట్​ చేసినందుకు పోలీసులను అభినందిస్తున్నట్లు ప్రకటన
  • రెండు కేసుల్లో ఎంక్వైరీ ఒకేలా ఉండాలి: ఆర్​ఎస్​ ప్రవీణ్​

హైదరాబాద్, వెలుగు: పదో తరగతి పేపర్ లీకేజీ కేసులో 48 గంటల్లోనే అరెస్టు చేసిన పోలీసులు... టీఎస్​పీఎస్సీ పేపర్ లీకేజీలో ఇప్పటివరకు అసలైన కుట్రదారులు ఎవరో ఎందుకు తేల్చడం లేదని, ఎందుకు అరెస్ట్ చేయడం లేదని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్​ఎస్​ ప్రవీణ్​ కుమార్​ ప్రశ్నించారు. బీఎస్పీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘పదో తరగతి పేపర్​ లీకేజీలో బీజేపీ పెద్దల హస్తం ఉందంటున్నరు... పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ల లీకేజీలో బీఆఆర్​ఎస్​ పెద్దల హస్తం ఉంటుంది. రెండు కేసులు ఒకటే.. విచారణ కూడా ఒకే రకంగా జరపాలి” అని డిమాండ్​ చేశారు. పేపర్ల లీకేజీలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. 

‘‘టెన్త్​ క్లాస్​ పేపర్ల  కేసుకు 48 గంటలు.. పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసుకు మాత్రం 30 రోజులా?’’ అని ప్రశ్నించారు. టెన్త్​ పేపర్​ లీకేజీలో వాట్సప్ చాట్, కాల్ డేటా తీసి నిందితులను అరెస్ట్​ చేశారని, అదే టీఎస్​పీఎస్సీ విషయంలో పోయిన నెల 11న కేసు నమోదైతే, 14న సిట్ కు అప్పగించారని చెప్పారు. పదో తరగతి హిందీ పేపర్​ను  ఉదయం 9.30 కు ఫొటో తీసి వందల గ్రూపుల్లో షేర్ చేశారని, చాలా మంది బీజేపీ నాయకులకు కూడా షేర్ చేసి, రాష్ట్ర ప్రజలను అయోమయానికి గురిచేసేందుకు కుట్ర చేశారని ప్రవీణ్​కుమార్​ ఆరోపించారు. కుట్రకు గల ఆధారాలను సేకరించి, కుట్ర కేసులో బండి సంజయ్​ను అరెస్ట్ చేసినందుకు వరంగల్ పోలీసు అధికారులను అభినందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ‘‘పేపర్ లీకైనట్లు నమ్మించేందుకు కుట్ర చేసిన బీజేపీ.. రాష్ట్రంలో కాంతి వేగంతో అబద్ధాలు, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసి మత కల్లోలాలు సృష్టించే ప్రమాదం ఉంది.  బండి సంజయ్ పై పీడీ యాక్టు పెట్టాలి” అని వ్యాఖ్యానించారు.