
- సీఎం కేసీఆర్పై మండిపడ్డ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ప్రవీణ్ కుమార్
తుంగతుర్తి, వెలుగు: ఇటీవల కురిసిన వర్షాలకు వరదల్లో 30 మంది చనిపోతే వారి కుటుంబాల వద్దకు ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లి పరామర్శించకుండా మహారాష్ట్రకు వెళ్లి రాజకీయాలు చేస్తున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ విమర్శించారు. బుధవారం సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలో బాబూ జగ్జీవన్ రావు, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు అమలు చేయలేదన్నారు. బీక్కేర్ వాగు తాటిపాముల, అనంతారం తదితర గ్రామాల్లో ఇసుక దందా కొనసాగుతుందని, దాన్ని ఆపే నాధుడే లేడన్నారు. ఎమ్మెల్యే, మంత్రి, ముఖ్యమంత్రి కనుసన్నలలోనే ఈ దందా కొనసాగుతుందని ఆరోపించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనుచరులు పట్టపగలు అడ్వకేట్ యుగేందర్ పై దాడి చేస్తే దోషులను శిక్షించకుండా కేసు పెట్టి వదిలేశారన్నారు. ఇదే గ్యాంగ్ ఫణిగిరిలో దాడి చేయడం వల్ల ఆ వ్యక్తి వారం రోజుల తర్వాత చనిపోయాడని తెలిపారు. దళితబంధులో తిరుమలగిరి మండలంలో అనేక అక్రమాలు జరిగాయని దళారులు ఫేక్ ఇన్వాయిస్లు సృష్టించి దళితులకు అందవలసిన రూ.10లక్షల్లో రూ.5లక్షలు ముట్టజెప్పి మిగిలిన డబ్బులు కాజేశారని అన్నారు. దీనిపైన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ జరిపి దోషులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. యాదాద్రి జిల్లాలోని కాందిశీకుల భూములను 400 ఎకరాలపై కన్నేసిన మంత్రి, ఎమ్మెల్యే ఆ భూములను కాపాడాలని చూసిన కలెక్టర్, ఆర్డీవోలను వెంటనే బదిలీ చేయించారని ఆరోపించారు. సమావేశంలో బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు బుడిగ మల్లేశ్ యాదవ్, నియోజకవర్గ అధ్యక్షుడు మల్లెపాక వెంకటేశ్, దాసరి శ్రీను, మండల అధ్యక్షుడు మల్లెపాక కృష్ణ, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.