దళితబంధు పేరుతో దగా చేస్తున్రు

దళితబంధు పేరుతో దగా చేస్తున్రు

ఏటూరునాగారం/ములుగు, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పేరుతో దగా చేస్తోందని బీఎస్పీ స్టేట్ కోఆర్డినేటర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. శుక్రవారం ఆయన మేడారంలోని వనత దేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఏటూరు నాగారంలో పర్యటించారు. ఎస్సీ కాలనీలో గవర్నమెంట్ నిర్మిస్తున్న డబుల్​బెడ్​రూం ఇండ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రవీణ్​మాట్లాడుతూ.. అధికార పార్టీ లీడర్ల అనుచరులకు దోచిపెట్టడం కోసమే దళితబంధు స్కీం తీసుకొచ్చారని ఆరోపించారు. మేడారం జాతరకు జాతీయ స్థాయి గుర్తింపు తీసుకురావడంలో టీఆర్ఎస్​ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్​అయ్యిందని విమర్శించారు. ఐదేండ్లుగా డబుల్​బెడ్​రూం ఇండ్ల పనులు ఇంచు కూడా కదల్లేదన్నారు. ఆదివాసీలకు పోడు పట్టాలు ఇవ్వకుండా భూములు గుంజుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏటూరునాగారంలో ఉన్న పేదరికం తాను ఎక్కడా చూడలేదని, ఎంతో చరిత్ర ఉన్న ప్రాంతాన్ని డెవలప్​చేయకపోవడం బాధాకరం అన్నారు. ఆయనతో బీఎస్పీ లీడర్లు గంధం శివ, నరేశ్, కార్యకర్తలు ఉన్నారు.