బహుజనులను సీఎం చేయడమే బీఎస్పీ లక్ష్యం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

బహుజనులను సీఎం చేయడమే బీఎస్పీ లక్ష్యం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

సికింద్రాబాద్, వెలుగు: రాబోయే ఎన్నికల్లో అగ్రకుల ఆధిపత్య పార్టీలను ఓడించి.. బహుజనులను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడమే బీఎస్పీ ఏకైక లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు రాజ్యాధికారం దక్కేవరకు పేద ప్రజల పక్షాన బీఎస్పీ నిరంతరం పోరాడుతుందన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో గిరిజన శక్తి ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన ట్రైబల్ డిక్లరేషన్ రాష్ట్ర స్థాయి సమావేశానికి ఆయన చీఫ్​ గెస్ట్​గా హాజరై మాట్లాడారు. ఎన్నికల్లో ఆధిపత్య పార్టీలు పెట్టే ప్రలోభాలకులోనై ఓట్లను అమ్ముకోవద్దన్నారు.

 రాష్ట్రంలో ఒక్క శాతం జనాభా కూడా లేని వెలమలకు 16 అసెంబ్లీ సీట్లు, నాలుగు శాతం జనాభాలేని రెడ్లకు 48 అసెంబ్లీ సీట్లు ఎలా కేటాయిస్తారని ఆయన ప్రశ్నించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనులు, ఆదివాసీల హక్కులకు రక్షణ కల్పించే జీవో నెం.3 ను పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీనికోసం గిరిజన ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. అటవీ ప్రాంతాల్లో ఏళ్ల తరబడి పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులతో పాటు, భూమిలేని అన్ని వర్గాల పేదలకు పట్టాలు ఇవ్వాలన్నారు. రాబోయే ఎన్నికల్లో గిరిజన డిక్లరేషన్ పై ప్రతి తండాలో చర్చ జరగాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కో ఆర్డినేటర్ ఎం.వెంకటేష్ చౌహాన్, రాష్ట్ర అధ్యక్షుడు కొర్ర శరత్ నాయక్, ప్రకాశ్​ రాథోడ్, మంగు నాయక్, తుటా ఆర్గనైజింగ్ సెక్రటరీ రాజీవ్ పడియా, తెగా  నాయకులు రామచందర్ నాయక్, సురేశ్​నాయక్ పాల్గొన్నారు.