టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ స్కామ్ పై కేసీఆర్ ఒక్క మాట మాట్లాడడం లేదు

టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ స్కామ్ పై కేసీఆర్ ఒక్క మాట మాట్లాడడం లేదు

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలను అతలాకుతలం చేస్తున్న టీఎస్ పీఎస్సీ పేపర్ల లీకేజీ స్కామ్​ మీద సీఎం కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడడం లేదని, ఇదంతా చూస్తుంటే అసలు రాష్ట్రానికి సీఎం ఉన్నాడా అనే అనుమానం కలుగుతోందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్​అన్నారు. మహారాష్ట్రకు వెళ్లడానికి, అక్కడోళ్లను తీసుకొచ్చి పార్టీలో చేర్చుకోవడానికి టైమ్ ఉంది కానీ, నిరుద్యోగుల గురించి పట్టించుకునే తీరిక లేదని విమర్శించారు. శనివారం నాగర్ కర్నూల్ జిల్లా తూడుకుర్తి, శ్రీపురం, చందుబట్ల, వనపట్ల, పెద్దముందునూర్, గన్యాగులలో బహుజన రాజ్యాధికార యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో అరాచక పాలన సాగుతున్నదని, పేద బిడ్డలకు రావాల్సిన ఉద్యోగాలను రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకు అమ్ముకున్నారని ఆరోపించారు. పేపర్ ​లీకేజీ నిందితులు, సభ్యులు, చైర్మన్​ను కాపాడాలని సిట్ చూస్తోందని, సిట్​కు నిందితులను పట్టుకోవాలన్న ఆసక్తి గానీ, కుట్రను బయటపెట్టాలన్న ఉద్దేశం గానీ లేదని ఆరోపించారు. 

పేదల భూములు ధరణిలో బంధి

పేదల భూములను ధరణిలో బంధించి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. భరిస్తే బానిసలుగా ఉంటామని, తెగిస్తే వాళ్ల కన్న ముందుకు వెళ్తామన్నారు. నల్ల మట్టి, ఇసుక, రియల్ మాఫియాలను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెంచి పోషిస్తున్నారని అన్నారు. బీఎస్పీ పార్టీ నుంచి బీసీలకు 70 సీట్లు కేటాయిస్తామని తెలిపారు. 

పోలీసులేమైనా మీ బానిసలా?

2009 బ్యాచ్ ఎస్ఐలకు ప్రమోషన్ల విషయంలో అన్యాయం జరుగుతున్నదని ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు. 46 సార్లు వినతి పత్రం ఇచ్చినా ఫైల్ చూసేంత టైమ్ ​తెలంగాణ సీఎంవో, డీజీపీకి దొరుకుతలేదా అని ప్రశ్నించారు.  ‘‘పోలీసులేమైనా మీ బానిసలా కేసీఆర్..? మా పన్నుల నుంచి నెలకు నాలుగున్నర లక్షల జీతం తీసుకుంటూ లంచాల కోసం మా ఫైళ్ల మీద కూర్చుంటే మేం ప్రగతి భవన్ కు రావాల్సి ఉంటది’’ అని ట్విట్టర్​లో హెచ్చరించారు.