కాగజ్‌నగర్, వెలుగు: తన ఫోన్ ట్యాపింగ్‌కు కారకులైనవారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు కంప్లయింట్ చేసినా ఇప్పటి వరకు స్పందించలేదని, సీఎం కేసీఆర్ నుంచి ఇంకా ఎటువంటి అనుమతి రాకపోవడంతోనే పోలీసులు గమ్మున కూర్చున్నట్లున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్అన్నారు. ఈ విషయాన్ని కోర్టులోనే తేల్చుకుంటానని స్పష్టం చేశారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా సిర్పూర్ నియోజకవర్గంలో ఆయన చేపట్టిన యాత్ర గురువారం 4వ రోజుకు చేరింది. సిర్పూర్(టీ) మండలంలోని తెలంగాణ-– మహారాష్ట్ర బార్డర్ మాకుడితో పాటు పలు గ్రామాల్లో ప్రవీణ్‌కుమార్ పర్యటించి ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో బీఎస్పీ నేతలు సిడాం గణపతి, హర్షద్‌హుస్సేన్, రాంప్రసాద్, ప్రవీణ్, షేక్‌చాంద్, నవీన్ పాల్గొన్నారు.
పోలీస్ అభ్యర్థుల దీక్షకు మద్దతు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులు చేపట్టిన దీక్షకు బీఎస్పీ మద్దతు ఇస్తున్నట్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. 1600/800 మీటర్ల రన్నింగ్ క్వాలిఫై అయినవారికి మెయిన్స్ చాన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
