రైతు కూలీల కోసం సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలి

రైతు కూలీల కోసం సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలి

వరంగల్​ సిటీ/ హసన్​పర్తి/ , వెలుగు : వెలుగు: రాష్ట్రంలో ఎక్కువగా బెల్ట్​షాపులకే  ప్రాధాన్యత ఇస్తున్నారని, తాము అధికారంలోకి వస్తే వాటిని బంద్​చేయించి అందులో మిల్క్​షాపులను ఏర్పాటు చేయిస్తామని బీఎస్పీ స్టేట్​చీఫ్​డాక్టర్​ఆర్​ఎస్. ప్రవీణ్​కుమార్​ అన్నారు. రెండో విడత బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా గురువారం ఆయన వరంగల్​ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్​లో రైతులు, హమాలీలు, మహిళా కూలీలతో మాట్లాడారు. మార్కెట్​లో కొంతమంది ఆడ కూలీలు తమ భర్తలు మద్యానికి బానిసలై చనిపోయారని రోదించారని, ఇలా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. వితంతు మహిళలు, రైతు కూలీల కోసం సంక్షేమ బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు.  తర్వాత హనుమకొండ ఏకశిలా పార్కు వద్ద వీఆర్ఏలు చేస్తున్న నిరసన దీక్ష కు మద్దతు పలికారు. ప్లాన్​ప్రకారమే 2014 నుంచి రెవెన్యూ వ్యవస్థలో లోపాలున్నాయని చెబుతూ వీఆర్వోలను తొలగించి, వీఆర్ఏలకు ప్రకటించిన హామీలను మరిచిపోయారన్నారు. గుండ్ల సింగారం, భీమారం, చింతగట్టు, హసన్ పర్తి లో  యాత్ర చేసిన ఆయన పలువురు యువకులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జిల్లా ఇన్​చార్జి మాదారపు రవికుమార్, జిల్లా అధ్యక్షుడు మంద శ్యామ్ సుందర్, వర్ధన్నపేట నియోజకవర్గ అధ్యక్షుడు చాతల్ల వేణుగోపాల్ పాల్గొన్నారు.

కాజీపేట : ఎమ్మెల్యేలు కేసీఆర్ ముందు చెంచాగిరీ చేస్తూ బానిసలుగా బతుకుతున్నారని ప్రవీణ్​కుమార్​ అన్నారు. కాజీపేట మండలం కడిపికొండ, మడికొండ, భట్టుపల్లి, టేకులగూడెం గ్రామాల్లో గురువారం రాత్రి మాట్లాడారు. టీఆర్ఎస్ లీడర్లు రోడ్లపై వెళితే కుక్కలు కూడా వారిని పలకరించే పరిస్థితి లేదన్నారు. అందుకే డబ్బులు వెదజల్లి కిరాయి మనుషులను తెచ్చుకొని పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారన్నారు. అగ్నిపథ్​స్కీంకు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన అల్లర్లలో కాల్పులు జరిపించింది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ఆ కాల్పుల్లో మరణించిన రాకేష్ అంతిమయాత్రలో గులాబీ కండువాలు కప్పుకొని వచ్చి శవరాజకీయాలు చేసింది కూడా వారేనన్నారు.