కేసీఆర్ ​ఇంజినీర్​ కావడం వల్లే  కాళేశ్వరం మునిగింది: RS ప్రవీణ్

కేసీఆర్ ​ఇంజినీర్​ కావడం వల్లే  కాళేశ్వరం మునిగింది: RS ప్రవీణ్
  •    అంబేద్కర్ ​పేరు పెట్టినందుకే     ‘ప్రాణహిత– చేవెళ్ల’ రీ డిజైన్  
  •     మన రైతులను ముంచి     పక్క రాష్ట్రాల రైతులకు పరిహారమా?  
  •     బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 

కాగ జ్ నగర్, వెలుగు :  ఎందరు ఎక్స్​పర్ట్స్​ చెప్పినా వినకుండా సీఎం కేసీఆర్ ​ఇంజినీర్ అవతారమెత్తి అంబేద్కర్ ​ప్రాణహిత –చేవెళ్ల సుజల స్రవంతి పథకం ప్రాజెక్ట్ ను రీ డిజైన్ చేసి కాళేశ్వరంగా మార్చాడని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. దీంతో కాళేశ్వరం మునిగిందన్నారు. అంబేద్కర్ ​పేరు పెట్టినందుకే ప్రాజెక్టు మధ్యలో నిలిపివేసి, రీడిజైన్ పేరుతో ఆదిలాబాద్ ప్రజలను ముంచాడన్నారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా మంగళవారం కౌటాల, చింతలమానేపల్లి మండలాల్లో యాత్ర చేశారు. కౌటాల మండలంలోని తుమ్మిడిహెట్టి వద్ద  ప్రాణహిత –చేవెళ్ల ప్రాజెక్టునిర్మాణ స్థలాన్ని పరిశీలించి నాటు పడవలో ప్రయాణించారు. ఆయన మాట్లాడుతూ 148 మీటర్ల ఎత్తులో ప్రాణహిత వద్ద ప్రాజెక్ట్ నిర్మాణం చేపడితే ఎటువంటి లిఫ్ట్, కరెంట్ అవసరం లేకుండా నీళ్లు పొలాలకు పారించే అవకాశమున్నా, దాన్ని లిఫ్ట్ లతో తరలించి అందించే ప్లాన్ చేసిన ఘనుడు కేసీఆర్​అని ఎద్దేవా చేశారు. వరదలకు పంపుహౌస్ మునిగిపోవడంతో రూ.1500 కోట్ల నష్టం వచ్చిందని ఇది ‘మెగా ఇంజినీర్’ వైఫల్యం కాదా అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి చేసిన ఖర్చులపై  వైట్​పేపర్​ రిలీజ్​ చేయాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు కట్టనప్పుడు  రైతులకు తక్కువ పరిహారమిచ్చి తీసుకున్న భూములను ఎందుకు తిరిగివ్వడం లేదన్నారు. భూములు కోల్పోయి, ఉన్న భూములకు నీళ్లు రాక ఇక్కడి రైతులు నష్టపోయారన్నారు. బీఎస్పీ అధికారంలోకి వచ్చిన వెంటనే  ప్రాణహిత –చేవెళ్ల ప్రాజెక్టు నిర్మించి తీరుతామన్నారు. ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మరో ప్రాజెక్ట్ కడతామని మ్యాపులు గీసి చూపెట్టారని, అది ఇప్పటికీ నెరవేరలేదన్నారు. మన రాష్ట్రంలో రైతులకు పంట మునిగితే పరిహారం ఇవ్వడం చేతకాని సీఎం.. పక్క రాష్ట్రంలో రైతులకు లక్షల్లో పరిహారం ఇవ్వడం ఏమిటన్నారు. రాష్ట్ర కార్యదర్శి సిడం గణపతి, సిర్పూర్ నియోజకవర్గ ఇన్​చార్జి అర్షద్ హుస్సేన్, నియోజకవర్గ నాయకులు ప్రవీణ్ కుమార్, 
జ్యోతి, గౌతమ్ పాల్గొన్నారు.