పేదలను లిక్కర్​కు బానిసలు చేస్తున్నరు

పేదలను లిక్కర్​కు బానిసలు చేస్తున్నరు

తల్లాడ, వెలుగు: తెలంగాణ ప్రభుత్వంలో అధికారులకు స్వేచ్ఛ లేదని, ఎమ్మెల్యేలు, మంత్రులకు ధైర్యం లేదని బీఎస్పీ రాష్ట్ర చీఫ్​కోఆర్డినేటర్​ఆర్ఎస్​ప్రవీణ్​కుమార్​అన్నారు. సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ కు పరిమితమయ్యారని, రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అన్న రీతిలో ప్రభుత్వ పాలన కొనసాగుతోందన్నారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా బుధవారం ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలోని గంగుల నాచారం, నాచారం, ఏనుకూరు, ఇందిరానగర్ కాలనీ, అంబేద్కర్ నగర్ కాలనీ, రాఘవాపురం, తిమ్మారావుపేట తదితర గ్రామాల్లో పర్యటించారు. ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.  తిమ్మారావుపేటలో విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం శ్రీలంకలా అప్పులకుప్పగా తయారైందన్నారు. సీఎం కేసీఆర్​నైతిక బాధ్యత వహించి ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై వైట్​పేపర్​రిలీజ్​చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీతో ప్రజలు విసిగిపోయారన్నారు. టీఆర్ఎస్​ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎక్కడా కనిపించడం లేదన్నారు. గ్రామాల్లో ఎక్కడ చూసినా పేదలు చీరలనే గుడారాలుగా చేసుకుని జీవనం సాగిస్తున్నారన్నారు. వైరా నియోజకవర్గంలో రెండు రోజుల పర్యటనలో ప్రజలు ఎన్నో సమస్యలు తమ దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు. ఎక్కడ చూసినా కిడ్నీ వ్యాధులు, పక్షవాతం, డయాలసిస్ రోగులు కనిపిస్తున్నారని చెప్పారు. ప్రజలకు 108, 104 సేవలు అందడం లేదన్నారు. పేదల పరిస్థితి దయనీయంగా మారిందని తెలిపారు. మరోవైపు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు, గిరిజనేతరులు భూములపై హక్కులు కోల్పోతున్నారని చెప్పారు. తెలంగాణలో విద్య, వైద్యానికి కాకుండా మద్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారని, పేదలను లిక్కర్​కు బానిసలు చేస్తున్నారని విమర్శించారు. 

పోడు పట్టాలపైనే మొదటి సంతకం

రాష్ట్రంలో బీఎస్పీని ప్రజలు ఆదరిస్తున్నారని ప్రవీణ్​కుమార్​అన్నారు. బీఎస్పీ అధికారంలోకి రాగానే పోడు భూములకు పట్టాలిచ్చే ఫైలుపై మొదటి సంతకం చేస్తానని చెప్పారు. ప్రజల నుంచి ప్రభుత్వం తీసుకున్న అసైన్డ్ భూములను వెంటనే ఎస్సీ, ఎస్టీ, బీసీలందరికీ పంచి పూర్తి హక్కులు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఆదివాసీలపై చేస్తున్న అరాచకాలపై తిరగబడాలని పిలుపునిచ్చారు. ఆదివాసీలతోనే అడవులు అభివృద్ధి చెందాయని, వారు లేకుంటే అడవులే ఉండవన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గర పడ్డాయన్నారు. కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా అధ్యక్షులు బుర్ర ఉపేందర్, జిల్లా ఇన్​చార్జి పుల్లయ్య, వైరా నియోజకవర్గ బాధ్యులు నారా పోగు ఉదయ్, మహిళా అధ్యక్షురాలు ఉప్పల మంజుల, కన్వీనర్ విజయకుమారి, మండల అధ్యక్షుడు ఎంగల నరేశ్​ తదితరులు పాల్గొన్నారు.