కేసీఆర్ బంధువులకు ఒక న్యాయం, పేదొల్లకు మరొక న్యాయమా?

కేసీఆర్ బంధువులకు ఒక న్యాయం, పేదొల్లకు మరొక న్యాయమా?

కరీంనగర్: ఆత్మహత్యాయత్నం చేసి చావుబతుకుల మధ్య కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మిడ్ మానేరు నిర్వాసితుడు రాజయ్యను బీఎస్పీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 

‘నీలోజిపల్లికి చెందిన రాజయ్య ఆరు ఎకరాల భూమిని కోల్పోయాడు. దీనికి సంబంధించిన పరిహారం ఇవ్వాలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆదేశించినా ఇవ్వలేదు. కాళ్లు,  చెప్పులరిగేలా తిరిగినా అధికారులు పట్టించుకోలేదు. రూ. 9.4 లక్షల పరిహారం రావాల్సి ఉంది. ముంపులో ఆరు ఎకరాలు పోగా మిగిలిన ఒక ఎకరంలో పంట వేసుకుంటే ఆ పంటను కూడా అధికారులు ధ్వంసం చేశారు. మొన్న కాళేశ్వరం ముంపు రైతు ఆత్మహత్య చేసుకోగా, ఈ రోజు ఇక్కడ రాజయ్య పురుగుల మందు తాగాడు. ఈ కుటుంబాల కన్నీళ్లు తుడవడానికి ఏ అధికారి, ఏ ఎమ్మెల్యే రాలేదు. ఇదేనా రైతు సంక్షేమం అంటే? మీ అధికారులే పరిహారం ఇవ్వాలని రాశారు కదా మరి ఏడు నెలలుగా ఏం చేశారు. ఎంపీ జోగిని పల్లి సంతోష్ కుమార్ బంధువులకు అర్హత లేకున్నా లక్షల రూపాయల పరిహారం ఇచ్చారు. మీ బంధువులకు ఒక న్యాయం, పేదొల్లకు మరొక న్యాయమా?  చావు బతుకుల మధ్య ఉన్న రాజయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. వైద్య చికిత్సకు అయ్యే ఖర్చులు ప్రభుత్వమే భరించడంతో పాటు, రావాల్సిన పూర్తి పరిహారం కూడా వెంటనే విడుదల చేయాలి. ఓ వైపు కేంద్రం.. అంబానీ, ఆదానీలకు దేశసంపద కట్టబెడుతుంటే.. రాష్ట్రంలో కేసీఆర్ మాత్రం రైతు చట్టాలపై మాట్లాడటం లేదు’ అని ప్రవీణ్ కుమార్ అన్నారు.

For More News..