రాష్ట్రానికి కేసీఆర్ కుటుంబం నుంచి విముక్తి కల్పించాలె

రాష్ట్రానికి కేసీఆర్ కుటుంబం నుంచి విముక్తి కల్పించాలె
  • మునుగోడులో నీలి జెండా ఎగరేద్దాం
  • బహుజనుల రాజ్యం తీసుకొద్దాం: ప్రవీణ్ కుమార్
  • రాష్ట్రానికి కేసీఆర్ కుటుంబం నుంచి విముక్తి కల్పించాలె
  • మునుగోడు అభివృద్ధికి రాజగోపాల్ ఏం చేశాడని ప్రశ్న

మునుగోడు/ఎల్బీ నగర్/చౌటుప్పల్, వెలుగు: మునుగోడు గడ్డ మీద నీలి రంగు జెండా ఎగురవేసి, గడీల పాలనను బద్దలు కొడతామని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మంగళవారం ప్రారంభమైన రెండో విడత బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా మునుగోడులో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటుచేసిన సభల్లో ప్రవీణ్​ మాట్లాడారు. మునుగోడులో ఇప్పటివరకు పన్నెండు సార్లు ఎన్నికలు జరగ్గా అగ్రకులాల వారే గెలిచారని, ఈసారి బీఎస్పీ గెలుస్తుందని, బహుజనుల రాజ్యం వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. బీఎస్పీ అంటే బీసీ,ఎస్సీ, ఎస్టీ మైనారిటీలతో పాటు అగ్రవర్ణాలలోని పేదలను గుర్తించి వారిని కలుపుకొని ముందుకు వెళ్లే పార్టీ అన్నారు. రాష్ట్రంలో 80 శాతం ఉన్న బహుజనులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఐదు శాతం ఉన్న  వారు రాష్ట్రాన్ని ఏలుతున్నారన్నారు. 

1300 మంది అమరవీరుల త్యాగాలు, పోరాటాల ద్వారా తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం నేడు కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అయిందని, కేసీఆర్ కుటుంబ ఆస్తులు ఎవరెస్ట్ లాగా పెరిగిపోతున్నాయని ఫైరయ్యారు. రాష్ట్రానికి కేసీఆర్ కుటుంబం నుంచి విముక్తి కల్పించాలన్నారు. ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఫెయిల్ అయి నలుగురు మహిళలు చనిపోవడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమన్నారు. దీనికి బాధ్యత వహిస్తూ మంత్రి హరీశ్ రావు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాకు చెందిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఓ మహిళ అయి ఉండి కూడా బాధిత కుటుంబాలను కనీసం పరామర్శించకపోవడం దారుణమన్నారు. హాస్టల్స్ లో పురుగుల అన్నం, ఫుడ్ పాయిజన్స్​తో ఎంతో మంది పేద విద్యార్థులు చదువులకు దూరం అవుతున్నారని చెప్పారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండి చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. 

సాధారణ ఎన్నికల్లోనూ పోటీ చేస్తం

మునుగోడు ఉప ఎన్నికతో పాటు సాధారణ ఎన్నికల్లోనూ బీఎస్పీ పోటీ చేస్తుందని ప్రవీణ్ కుమార్ తెలిపారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా దండు మల్కాపురం ఆందోల్ మైసమ్మ దేవాలయంలో ఆయన పూజలు నిర్వహించిన తర్వాత మాట్లాడారు. బహుజనులు మేల్కొని అధికారం చేపట్టాలని పిలుపునిచ్చారు. మంద ప్రభాకర్, దయానంద్, కామేశ్​ తదితరులు పాల్గొన్నారు.