రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బీజేపీ ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ బంధాన్ని ఆయన కాఫీతో పోల్చారు. ఆర్ఎస్ఎస్ కాఫీ లాంటిది అయితే.. బీజేపీ దానిపై నురగలాంటిదని అన్నారు. బీహార్‌లో పాదయాత్ర చేస్తున్న ప్రశాంత్ కిషోర్ చంపారన్ జిల్లాలోని లారియా వద్ద ఈ వ్యాఖ్యలు చేశారు. మహాత్మా గాంధీ కాంగ్రెస్‌కు పునరుజ్జీవం చేయడం ద్వారానే గాడ్సే సిద్ధాంతాన్ని ఓడించగలమని గ్రహించడానికి తనకు చాలా సమయం పట్టిందని చెప్పారు. గాంధీ హంతకుడు గాడ్సేకు ఆర్ఎస్ఎస్తో సంబంధాలపై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. బీహార్ సీఎం నితీష్ కుమార్, ఏపీ సీఎం జగన్ ఆశయాలను సాకారం చేసే బదులు తాను ఆ దిశగా పనిచేసి ఉంటే బాగుండేదని ప్రశాంత్ కిషోర్ అన్నారు.
నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఏర్పడిన ప్రతిపక్షాల కూటమిపై పీకే అభ్యంతరం వ్యక్తం చేశారు. బీజేపీ గురించి తెలియకపోతే నరేంద్రమోడీని ఎదుర్కోవడం కష్టమన్నారు. షార్ట్ కట్స్‌తో బీజేపీని కొట్టలేమన్నారు. ఇదిలా ఉంటే.. 2014 లోక్ సభ ఎన్నికల సమయంలో బీజేపీకి ప్రశాంత్ కిషోర్ సహకరించారు. బీజేపీ సొంతంగా మెజారిటీలోకి రావడానికి ఆయన వ్యూహాలు సహాయ పడ్డాయి. గతంలో జేడీయూ లీడర్‌గా ఉన్న పీకే ప్రస్తుతం ఆ పార్టీ అధినేత, బీహర్ సీఎం నితీష్ కుమార్‌ను బీజేపీ ఏజెంట్ అని విమర్శిస్తున్నారు. సీఏఏ-ఎన్ఆర్సీ సమయంలో తాను జేడీయూ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉన్నానని.. అయితే పార్లమెంట్లో మాత్రం జేడీయూ ఎంపీలు పౌరసత్వ సవరణ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయడంతో షాక్ అయ్యానని ప్రశాంత్ కిషోర్ అన్నారు.
