
బండిని రిజిస్టర్ చేసుకోవాల్నా సెల్ఫీ అప్లోడ్ చేస్తే సరి!
త్వరలోనే రవాణా శాఖ ప్రత్యేక యాప్
వాహనదారులకు తీరనున్న తిప్పలు
త్వరలోనే అందుబాటులోకి
ప్రస్తుతం యాప్ తయారీ దశలోనే ఉంది. త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తం. దీనిలో అప్లికేషన్‌తోపాటు సెల్ఫీ దిగి అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఆర్టీఏ కార్యాలయానికి రావాల్సిన అవసరం ఉండదు. మొదట కొన్ని సేవలు తెస్తం. ఆ తర్వాత పూర్తిగా అమల్లోకి వస్తయి. – రమేశ్, జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్
హైదరాబాద్, వెలుగు: లైసెన్స్ కావాలన్నా, బండి రిజిస్టర్ చేసుకోవాలన్నా ఆర్టీఏ ఆఫీసుల్లో క్యూ కట్టాల్సిన పరిస్థితి. ఏజెంట్లను నమ్ముకుని జేబులు గుల్ల చేసుకోవాల్సిన దుస్థితి. అక్కడ పడే తిప్పలు అన్నీ ఇన్నీ కావు. ఇకపై ఆ తిప్పలకు చెక్ చెప్పేలా అరచేతిలోనే ఆర్టీఏ సేవలు అందనున్నాయి. ఒక్క సెల్ఫీ దిగి, దరఖాస్తుతో పాటు అప్లోడ్ చేస్తే సరి.. అన్ని పనులు ఇంటి నుంచే అయిపోతాయి. అందుకోసం త్వరలోనే ప్రత్యేక యాప్‌ను తీసుకురాబోతోంది రవాణా శాఖ. ప్రస్తుతం అది టెస్టింగ్ దశలోనే ఉందని, త్వరలోనే దానిని ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. యాప్ తయారీ బాధ్యతను ఓ ప్రైవేట్ కంపెనీకి ఇచ్చారు. ఇప్పటికే ఏజెంట్ల బెడదను తప్పించి పనులు ఈజీగా కావడానికి 59 రకాల సేవలను ఆన్లైన్లో అందిస్తోంది ఆర్టీఏ. మిగతా పనులకు ఆఫీసుకు వెళ్లడం తప్పనిసరి.
వాటికీ చెక్ చెప్పి ఇంటి నుంచే అన్ని పనులూ చేసుకునేలా ఈ కొత్త యాప్‌ను తయారు చేయిస్తోంది. రెండు దశల్లో యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. మొదటి దశలో 34 సర్వీసులు, రెండో దశలో మరికొన్ని సర్వీసులు అందుబాటులోకి తీసుకొస్తారు. ఆల్రెడీ దిగిన ఫొటోలను అప్లోడ్ చేయకుండా, అప్పటికప్పుడు సెల్ఫీ దిగి అప్లోడ్ చేసేలా యాప్‌కు సెక్యూరిటీ ఫీచర్లు పెడుతున్నారు. అవసరమైన ఐడీ కార్డులను అప్లోడ్ చేసేందుకూ అందులోనే అవకాశం కల్పిస్తారు. అన్నీ కరెక్ట్‌గా ఉంటే నేరుగా ఇంటికే మనం అప్లై చేసుకున్న పేపర్లను పంపిస్తారు. డ్రైవింగ్ లైసెన్స్‌కు అప్లై చేసుకున్నోళ్లు మాత్రం డ్రైవింగ్ టెస్ట్ కోసం ఒక్కసారి ఆఫీసుకు వెళ్లాల్సి ఉంటుంది.