రెండో రోజూ ఆర్టీఏ తనిఖీలు ..ప్రైవేట్ బస్సులపై 21 కేసులు,రూ.69 వేల ఫైన్

రెండో రోజూ ఆర్టీఏ తనిఖీలు ..ప్రైవేట్ బస్సులపై 21 కేసులు,రూ.69 వేల ఫైన్

హైదరాబాద్​సిటీ, వెలుగు: కర్నూలు బస్సు ప్రమాదం నేపథ్యంలో గ్రేటర్​పరిధిలో ఆర్టీఏ అధికారులు రెండో రోజైన ఆదివారం కూడా ప్రైవేట్​బస్సుల తనిఖీలు కొనసాగించారు. ఎల్బీనగర్, దిల్​సుఖ్​నగర్, మేడ్చల్​రోడ్, ఉప్పల్​తదితర ప్రాంతాల్లో ప్రైవేట్​బస్సులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఫైర్​సేఫ్టీ, ఫస్ట్​ఎయిడ్​బాక్సులు, అలారం, ఎగ్జిట్​విండోస్​దగ్గర సుత్తి లేకపోవడం లాంటి విషయాలను గమనించి కేసులు నమోదు చేయడమే కాకుండా ఫైన్లు వేశారు. 

గగన్​పహాడ్​వద్ద బెంగళూరు నుంచి వస్తున్న పలు ప్రైవేట్​ట్రావెల్స్​బస్సులను చెక్​చేసి ఐదు బస్సులపై కేసులు నమోదు చేశారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో ఏడు బస్సులపై కేసు నమోదు చేసి రూ.35 వేల ఫైన్​విధించారు. 

మరో ఆర్టీఏ బృందం సౌత్​జోన్​ పరిధిలో తనిఖీలు నిర్వహించి 11 కేసులు నమోదుచేసి రూ.31వేల జరిమానా విధించింది. ఈస్ట్​ జోన్​ పరిధిలో 3 కేసులు నమోదు చేసి 3వేలు జరిమానా విధించినట్టు అధికారులు తెలిపారు. గ్రేటర్​ పరిధిలో ఆదివారం 21 కేసులను నమోదు చేసి 69వేల జరిమానా విధించినట్టు అధికారులు తెలిపారు.