నిన్న సీజ్.. నేడు రిలీజ్: లగ్జరీ కార్ల విషయంలో ఆర్టీఏ వింత రూల్‌

నిన్న సీజ్.. నేడు రిలీజ్: లగ్జరీ కార్ల విషయంలో ఆర్టీఏ వింత రూల్‌

హైదరాబాద్‌లో నిన్న సీజ్‌ చేసిన లగ్జరీ కార్లను ఒక్క రోజులోనే ఎటువంటి ప్రొసీజర్ పూర్తి కాకుండానే ఆర్టీఏ అధికారులు రిలీజ్ చేసేశారు. పోలీసుల స్టేషన్‌లో వాటిని పెట్టి ఉంచితే డ్యామేజ్ అయ్యే చాన్స్ ఉందని కారణంగా చెప్పి 11 కార్లను ఒక్క రోజులోనే వదిలేశారు. దీంతో ఆర్టీఏ అధికారులు పెద్దోడి విషయంలో ఒకలా, పేదోడి విషయంలో మరోలా రూల్స్ ఫాలో అవుతున్నారని జనం నుంచి విమర్శలు వస్తున్నాయి. పేదోడి విషయంలో ఇలా ఒక్క రోజులోనే సీజ్ చేసిన వాహనాలను వదిలేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. రూల్స్ ప్రకారం ఫైన్లు కట్టించుకుని, కోర్టులో హజరైన తర్వాత గానీ వారం పది రోజులు గడిచినా బండి బయటకు ఇవ్వరని అంటున్నారు.

కోట్ల ఖరీదు చేసే కార్లు.. ట్యాక్స్ కట్టలేదని సీజ్

రిజిస్ట్రేషన్ ట్యాక్స్ కట్టకుండా రోడ్డుపైకి వచ్చిన 11 లగ్జరీ కార్లను సీజ్ చేశారు. శంషాబాద్ ఎయిర్‌‌పోర్టు రూట్‌లో వెళ్తుండగా  డ్రైవర్ల నుంచి సీజ్ చేసిన వీటిని ఒక్క రోజు తిరగకుండానే ఓనర్లకు అప్పగించేశారు ఆర్టీఏ అధికారులు. ఆ కార్లన్నీ ఒక్కొక్కటి రూ.3 కోట్ల నుంచి 6 కోట్ల వరకు కాస్ట్ ఉంటాయని, ఈ కార్లకు రిజిస్ట్రేషన్ ట్యాక్స్, రోడ్ టాక్స్ కట్టలేదని డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ పాపారావు తెలిపారు. సీజ్‌ చేశాక వాటిని పెట్టిన ప్రాంతంలో ఎలుకలు, పదికొక్కులు ఉంటే కార్లను పాడు చేస్తాయని, అంత కాస్ట్‌లీ కార్లుకు ప్రభుత్వం సెక్యూరిటీ ఇవ్వలేదని వాటి ఓనర్లు ఆందోళన వ్యక్తం చేశారని చెప్పారు. ఆ కార్లకు సంబంధించి ట్యాక్స్ కట్టడంతో పాటు ఆలస్యానికి ఫైన్ కూడా కడుతామని ఓనర్లు లిఖితపూర్వకంగా హామీ ఇవ్వడంతో వాటిని వదిలేశామని ఆయన అన్నారు. కానీ సాధారణంగా ఏదైనా వాహనం రూల్స్ ఉల్లంఘించి దొరికితే ఆ బండిని సీజ్‌ చేసి, సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌కు తరలిస్తారు. దానికి సంబంధించి ట్యాక్సులు, ఫైన్లు అన్ని కట్టిన తర్వాత గానీ ఆ వెహికల్‌ను వదలరు. కొన్ని సందర్భాల్లో అయితే కోర్టుకు హాజరైతే గానీ ఏ పది రోజులకో బండి చేతికి రాదు.