హైదరాబాద్లో ఆర్టీసీ, మెట్రో కామన్ పాస్.. ఒకే కార్డుతో బస్సు, మెట్రోల్లో ప్రయాణం

హైదరాబాద్లో ఆర్టీసీ, మెట్రో కామన్ పాస్.. ఒకే కార్డుతో బస్సు, మెట్రోల్లో ప్రయాణం
  •  రోజువారీ పాస్ రూ.400.. నెలవారీ పాస్ రూ.8,500
  •  అందుబాటులోకి 'మీ టికెట్' యాప్.. ఇక ఫోన్ నుంచే టికెట్లు
  •  అక్టోబర్ 02న ప్రజాభవన్​లో కామన్​పాస్, యాప్ ప్రారంభం​

హైదరాబాద్, వెలుగు:  గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రయాణికులకు టీజీఎస్‌‌ఆర్టీసీ, హైదరాబాద్ మెట్రో రైల్ సంయుక్తంగా గుడ్ న్యూస్ చెప్పాయి. బస్సులు, మెట్రో రైళ్లలో వేర్వేరు టికెట్లు తీసుకునే పనిలేకుండా కామన్ పాస్ విధానాన్ని ప్రవేశపెట్టాయి. దీంతోపాటు సిటీ బస్సుల్లో పేపర్‌‌లెస్ ప్రయాణం కోసం ‘మీ టికెట్’ మొబైల్ యాప్‌‌ను ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చింది. శుక్రవారం (అక్టోబర్ 02న) ప్రజాభవన్​లో ఆర్టీసీ– మెట్రో కామన్​పాస్, మీ టికెట్​యాప్​ను డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు వివేక్​వెంకటస్వామి,  శ్రీధర్​బాబు, పొన్నం ప్రభాకర్​ ప్రారంభిస్తారు. 

ఆర్టీసీ–మెట్రో కామన్ పాస్ వివరాలు..

కోర్ అర్బన్ రీజియన్ (కూర్) పరిధిలోని ప్రయాణికుల కోసం ఈ కామన్ పాస్‌‌ను తీసుకొచ్చారు. అన్ని మెట్రో స్టేషన్లలో ఈ కార్డును జారీ చేస్తారు. మొదటిసారి కార్డు తీసుకున్నప్పుడు రూ.100 సెక్యూరిటీ డిపాజిట్ వసూలు చేస్తారు. కార్డు తిరిగి ఇచ్చేస్తే ఆ రూ.100 వాపస్ ఇస్తరు. ఔటర్ రింగ్ రోడ్ లోపల నడిచే అన్ని రకాల ఆర్టీసీ సిటీ బస్సులు (పుష్పక్ ఏసీ మినహా), మూడు కారిడార్లలోని మెట్రో రైళ్లలో ఈ పాస్‌‌ పనిచేస్తుంది. 

ఓపెన్ టికెట్ విధానం..

మరోవైపు సిటీ బస్సుల్లో పేపర్‌‌లెస్ ప్రయాణం కోసం ‘మీ టికెట్’ యాప్ ప్రవేశపెట్టారు. ఈ యాప్​ ద్వారా ఓపెన్ టికెట్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ప్రయాణికులు తమ ఫోన్ ద్వారా యాప్‌‌లోనే ఎక్కే స్టాప్, దిగే స్టాప్, టికెట్ రకాన్ని ఎంచుకుని డిజిటల్ పద్ధతిలో చెల్లింపులు చేయవచ్చు. పేమెంట్ పూర్తి కాగానే యాప్‌‌లో డైనమిక్ క్యూఆర్ కోడ్ టికెట్ వస్తుంది. ప్రయాణ సమయంలో బస్సులో కండక్టర్‌‌కు ఆ డిజిటల్ క్యూఆర్ కోడ్ చూపిస్తే సరిపోతుంది. ఇదే ‘మీ టికెట్’ యాప్‌‌లో ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా రూ.600 డిజిటల్ వీక్లీ బస్ పాస్‌‌ను కూడా ప్రవేశపెట్టారు. ప్రయాణికులు ఇకపై బస్ పాస్ సెంటర్ల వద్ద క్యూలో నిలబడే అవసరం లేకుండా, నేరుగా యాప్ ద్వారానే రూ.600 చెల్లించి పాస్ తీసుకోవచ్చు. ఈ పాస్‌‌తో వారం రోజులపాటు అన్ని సిటీ బస్సుల్లో అపరిమిత ప్రయాణం చేయవచ్చు. ఈ యాప్‌‌లో వీక్లీ పాస్‌‌తోపాటు రోజువారీ, నెలవారీ పాసులు కూడా అందుబాటులో ఉంటాయి.

పాస్ ఛార్జీలు ఇలా...
పాసు రకం    మెట్రో చార్జీ        ఆర్టీసీ చార్జీ        మొత్తం చార్జీ 
రోజువారీ పాస్     రూ.300            రూ.100        రూ. 400
నెలవారీ పాస్     రూ.7,000        రూ. 1,500    రూ.8,500