తుమ్మలూరు గేటు వద్ద ఘోర ప్రమాదం .. ఆర్టీసీ బస్సు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ

తుమ్మలూరు గేటు వద్ద ఘోర ప్రమాదం .. ఆర్టీసీ బస్సు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ
  • 20 మందికి గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం 

ఇబ్రహీంపట్నం, వెలుగు: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూర్ గేట్ సమీపంలో శ్రీశైలం రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం రాత్రి హైదరాబాద్ నుంచి కల్వకుర్తి వైపు సుమారు 50 మందితో వెళ్తున్న ఆర్టీసీ బస్సు, సోమశిల నుంచి హైదరాబాద్ కు 21 మందితో వస్తున్న బాలాజీ ట్రావెల్స్‌‌‌‌కు చెందిన ప్రైవేట్ బస్సు(టీఎస్ 12యూఈ 1220) ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు బస్సుల ముందుభాగం పూర్తిగా ధ్వంసమైంది. రెండు బస్సుల్లోని ప్రయాణికుల్లో మొత్తం 20 మంది గాయపడ్డారు.

 క్షతగాత్రుల్లో ఎనిమిది మందికి తీవ్ర గాయలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని వివిధ ఆసుపత్రులకు తరలించారు. ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన నలుగురిలో ఇద్దరు మహిళల పరిస్థితి సీరియస్​గా ఉన్నట్లు తెలిసింది. యాక్సిడెంట్ జరిగిన శ్రీశైలం రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. మహేశ్వరం పోలీసులు ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.