ములుగు జిల్లాలో చెట్టును ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు

ములుగు జిల్లాలో చెట్టును ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు

ములుగు జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. హనుమకొండ నుంచి ఏటూరునాగారం వెళ్తున్న బస్సు.. తాడ్వాయి మండలం కొండపర్తి వద్ద ఒక్కసారిగా అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. 

వివరాల్లోకి వెళ్తే... ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 28 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో సుమారు 10 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.

స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికులు కలిసి గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. అదృష్టవశాత్తూ ఎవరికీ ప్రాణాపాయం కలగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.