శ్రీశైలం ఘాట్‌ రోడ్డుపై అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు

శ్రీశైలం ఘాట్‌ రోడ్డుపై అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు
  • ప్రయాణికులకు త్రుటిలో తప్పిన ప్రమాదం

అమ్రాబాద్, వెలుగు : శ్రీశైలం వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు ఘాట్‌రోడ్డులో త్రుటిలో ప్రమాదం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్‌లోని పికెట్‌ డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు బుధవారం శ్రీశైలం వెళ్తోంది. నల్లమల అటవీ ప్రాంతంలోని వటవర్లపల్లి గ్రామానికి పది కిలోమీటర్ల దూరంలో గల అక్కమదేవి మలుపు ఘాట్‌ వద్ద బస్సు అదుపుతప్పి రోడ్డుపై అడ్డంగా నిలిచిపోయింది. 

దీంతో ఘాట్‌ రోడ్డుపై సుమారు రెండు గంటల పాటు ట్రాఫిక్‌ జామ్‌ అయింది. పర్యాటకులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై జయన్న ఘటనాస్థలానికి చేరుకొని బస్సును పక్కకు తప్పించి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు. ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.