భద్రాచలం, వెలుగు: భద్రాచలం డివిజన్లోని మారుమూల గిరిజన గ్రామాలకు ఆర్టీసీ సర్వీసులు నడపాలని కోరుతూ సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా జిల్లా నాయకురాలు కెచ్చెల కల్పన ఆధ్వర్యంలో మంగళవారం బస్టాండ్‌లో ఆందోళన నిర్వహించారు.
భద్రాచలం నుంచి దుమ్ముగూడెం మండలం కొత్తపల్లి, మారాయిగూడెం, లక్ష్మీనగరం నుంచి నారాయణపేట, భద్రాచలం నుంచి విలీన ఆంధ్రా వీఆర్‌పురం మండలం పోచారం వరకు, భద్రాచలం నుంచి పాల్వంచ మీదుగా అశ్వారావుపేట మండలం కావడిగుండ్ల వరకు బస్సులు నడపాలని నినాదాలు చేశారు. భద్రాచలం నుంచి కొత్తగూడెంకు రాత్రి పూట రైలు ప్రయాణీకులకు బస్సు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ఆర్టీసీ డిపో మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు.