- విప్ ఆది శ్రీనివాస్
వేములవాడరూరల్, వెలుగు: వేములవాడ నుంచి రాష్ట్రంలోని ఇతర పుణ్యక్షేత్రాలకు కనెక్టివిటీ పెంచుతున్నామని విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. సోమవారం వేములవాడ నుంచి భద్రాచలానికి నూతన బస్ సర్వీస్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే యాదగిరిగుట్ట, కాళేశ్వరం, శ్రీశైలం పుణ్యక్షేత్రాలకు బస్ సర్వీసులను ప్రారంభించామని, త్వరలో బాసరకు సర్వీస్ ప్రారంభిస్తామన్నారు. ఆర్టీసీని అన్ని విధాలుగా ఆదుకుంటున్నామన్నారు. మొన్నటి సమ్మెను ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల జీవిత సమస్యగా చూస్తే.. కొందరు రాజకీయాలకు వాడుకున్నారని విమర్శించారు.
అంతకుముందు అర్బన్ మండలం మారుపాక గ్రామంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం చేపట్టిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సేంద్రియ వ్యవసాయం, నీటి సంరక్షణ పద్ధతులు, పంట మార్పిడిపైన రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో యూనివర్సిటీ డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ వేణుగోపాల్ రెడ్డి, సిరిసిల్ల నోడల్ అధికారి డా సాయికుమార్, కాలేజీ అసోసియేట్ డీన్ డా.కె బి సునీతా దేవి, శాస్త్రవేత్త మధుకర్ రావు, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.

