విశాఖలో గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్ శంకుస్థాపన అనంతరం ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ ప్రసంగించారు. గూగుల్తో భారత్లోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి విశాఖకు వచ్చిందని, ఈ డేటా సెంటర్ ఏర్పాటులో అదానీ కనెక్స్, ఎయిర్ టెల్ నెక్స్ ట్రా సహకారం అందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు భూములు ఇచ్చిన రైతులకు, యువతకు ప్రత్యేకంగా నమస్కారం చేశారు. 2026 ఏప్రిల్ 28 నుంచి విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఓ చరిత్రను సృష్టిస్తోందని మంత్రి లోకేష్ ఆకాంక్షించారు.
ఉక్కు నగరంగా పేరు పొందిన విశాఖ ఇక డేటా సిటీ అవుతుందని, ఏఐ డేటా సెంటర్తో గ్లోబల్ ఐటీ మ్యాప్లోకి విశాఖ గూగుల్ వచ్చి చేరిందని హర్షం వ్యక్తం చేశారు. 2019-24 మధ్య రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని, దానిని పునరుద్ధరిస్తూ ప్రజలు కూటమికి ప్రజాప్రభుత్వానికి మద్దతు ఇచ్చారని చెప్పారు. సైబరాబాద్ను హైటెక్ సిటీగా మార్చిన ట్రాక్ రికార్డు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉందని తెలిపారు. ఆర్సెలార్ మిట్టల్, గూగుల్ లాంటి ప్రాజెక్టులు ఏపీకి రావడం.. వేగంగా పెట్టుబడులు వస్తున్నాయనటానికి ప్రత్యక్ష ఉదాహరణ అని తెలిపారు.
దేశంలో డబుల్ ఇంజన్ సర్కార్, ఏపీలో డబుల్ ఇంజన్ బులెట్ ట్రైన్ సర్కార్లతో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సాకారం అవుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ సహకారంతో దేశంలోనే 25 శాతం మేర పెట్టుబడులు ఏపీకి వస్తున్నాయని, ప్రపంచం గతంలో చూడని నవ భారతం ఈ టెక్ ప్రాజెక్టుతో సాకారం అవుతోందని చెప్పారు. సైబరాబాద్ నిర్మాణం అంతా చూశామని, ఇప్పుడు విశాఖలోని ఏఐ డేటా సెంటర్తో కొత్త ట్రాజెక్టరీ ఆవిష్కృతం అయిందని మంత్రి వివరించారు.
లక్షా 35 వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ఈ డేటా సెంటర్తో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్, మెకానికల్ సహా వివిధ రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని తెలిపారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని విధానం ప్రజా ప్రభుత్వానిదని, అభివృద్ధి వికేంద్రీకరణ అనేది తమ నినాదం అని మంత్రి నారా లోకేష్ చెప్పారు.
క్లస్టర్ బేస్డ్ అభివృద్ధితో రాష్ట్రాన్ని వికాసం వైపు నడిపిస్తున్నామని, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమలో వేర్వేరు రంగాల్లో పెట్టుబడులు వస్తున్నాయని చెప్పుకొచ్చారు. 20 లక్షల ఉద్యోగాల కల్పన కోసం ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ప్రజా ప్రభుత్వానిది గూగుల్ అయితే ఆ పార్టీది గొడ్డలి అని వైసీపీకి పరోక్షంగా మంత్రి చురకలంటించారు.
కొందరు కేసులు వేసి ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నించారని, గూగుల్ క్రెడిట్ కూడా తీసుకునేందుకు సీసీడీ రోగి ప్రయత్నిస్తారని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్పై విశ్వాసం ఉంచి పెట్టుబడులు పెట్టినందుకు గూగుల్కు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. అదానీ, ఎయిర్ టెల్ సంస్థలకు ధన్యవాదాలు తెలియచేస్తున్నామని, మొదటి ట్రిలియన్ డాలర్ ఎకనామిక్ రీజియన్గా విశాఖ ప్రాంతాన్ని ప్రజా ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని మంత్రి నారా లోకేష్ ప్రసంగించారు.

