- సమయానికి చేర్చడంతో నార్మల్ డెలివరీ
- పండంటి పాపకు జన్మనిచ్చిన తల్లి
తాండూరు, వెలుగు: కర్ణాటకకు చెందిన మహిళకు ఆర్టీసీ బస్సులో పురిటి నొప్పులు రాగా, డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి డైరెక్ట్ హాస్పిటల్‌కే తీసుకువెళ్లాడు. దీంతో సదరు మహిళ పండంటి పాపకు జన్మనిచ్చింది. కర్ణాటకలోని చించోలి తాలూకా జెట్టూరు గ్రామానికి చెందిన పుష్పలత సోమవారం తాండూరుకు కర్ణాటక డిపో బస్సులో బయలుదేరింది. తాండూరుకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండగా ఆమెకు పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి.
వెంటనే స్పందించిన బస్సు డ్రైవర్ బస్సును ఏకంగా తాండూరు మాతా శిశు సంరక్షణ కేంద్రానికి పోనిచ్చాడు. విషయం తెలుసుకున్న దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజమాలిక్ వెంటనే వైద్య సిబ్బందిని అప్రమత్తం చేసి బస్సు వద్దకే స్ట్రెచ్చర్ తీసుకువెళ్లారు. గర్భిణిని హుటాహుటిన లోపలకు తీసుకువెళ్లి నార్మల్ డెలివరీ చేశారు. పుష్పలతకు పాప పుట్టిందని, తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారని సూపరింటెండెంట్ తెలిపారు. అత్యవసర సమయంలోస్పందించి గర్భిణిని దవాఖానకు చేర్చిన బస్సు డ్రైవర్, కండక్టర్‌ను దవాఖాన సిబ్బంది, స్థానికులు, పుష్పలత కుటుంబసభ్యులు అభినందించారు.
