కాలు కోల్పోయిన డ్రైవర్ కు రూ. 50 లక్షల బీమా

కాలు కోల్పోయిన డ్రైవర్ కు  రూ. 50 లక్షల బీమా

హైదరాబాద్, వెలుగు: విధి నిర్వహణలో కాలు కోల్పోయిన ఆర్టీసీ డ్రైవర్ మదార్, ఆయన కుటుంబానికి రూ.50 లక్షల బీమా సొమ్మును ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి అందించారు. కరీంనగర్ జిల్లా కోరుట్ల డిపో లో డ్రైవర్ గా పనిచేసే ఎండీ.మదార్ గతేడాది అక్టోబర్ 9న విధి నిర్వహణలో భాగంగా  కోరుట్ల నుంచి హైదరాబాద్ వస్తుండగా కుకునూర్ పల్లి వద్ద బ్రిడ్జిపై నిలిపి ఉంచిన లారీని ఢీకొనడంతో గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో మదార్​ కాలు కోల్పోయి శాశ్వత అంగవైకల్యానికి గురయ్యాడు. 

ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో యూనియన్ బ్యాంక్  ‘సూపర్ సాలరీ సేవింగ్ అకౌంట్’ ద్వారా బాధిత కుటుంబానికి రూ.50 లక్షల చెక్​ అందింది. సంస్థ మార్గదర్శకాల ప్రకారం ఉద్యోగులందరూ యూబీఐ బ్రాంచీల్లో ఖాతాలు తెరిచి రూపే కార్డులు పొందడంతో ఈ బీమా వర్తిస్తున్నది. సోమవారం హైదరాబాద్ బస్ భవన్‌‌‌‌‌‌‌‌లో ఆర్టీసీ  ఎండీ నాగిరెడ్డి, యూబీఐ సీజీఎం రవీంద్రబాబు, డిప్యూటీ జనరల్ మేనేజర్ సత్యనారాయణ బాబ్జితో కలిసి రూ.50 లక్షల చెక్కును మదార్ కుటుంబ సభ్యులకు అందజేశారు.