పొల్యూషన్​ ఫ్రీ సిటీకి .. ఆర్టీసీ ముందడుగు

పొల్యూషన్​ ఫ్రీ సిటీకి .. ఆర్టీసీ ముందడుగు
  • 25 నాన్​ ఏసీ ఎలక్ట్రిక్​​ బస్సులను ప్రారంభించిన అధికారులు 
  • దశల వారీగా మరిన్ని అందుబాటులోకి  తెచ్చేందుకు ప్లాన్​

హైదరాబాద్, వెలుగు: అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీని బలోపేతం చేసేందుకు అనేక చర్యలు తీసుకుంటోంది. తాజాగా పొల్యూషన్​ ఫ్రీ ఆర్టీసీ బస్సులను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలకు ఎలక్ట్రిక్​బస్సులు నడుపుతుండగా, దశల వారీగా మరిన్ని బస్సులు తీసుకొచ్చేలా ఆర్టీసీని ప్రోత్సహిస్తోంది. మంగళవారం సిటీలో 25 నాన్​ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించింది. 

ఆర్టీసీ అధికారులు 2019, మార్చి నుంచి 12 మీటర్ ​లో ఫ్లోర్ ఏసీ బస్సులను  40 వరకు అందుబాటులోకి తీసుకురాగా, గతేడాది మే నెలలో హైదరాబాద్– విజయవాడ మార్గంలో 10 ఈ‌‌– గరుడ బస్సులను ప్రారంభించారు. ప్రస్తుతం అవి సక్సెస్​ఫుల్​గా నడుస్తున్నాయి. సిటీలోని కంటోన్మెంట్, మియాపూర్–2 డిపోలు ఈ–బస్సులను ఆపరేట్​చేస్తున్నాయి. అలాగే శంషాబాద్​ఎయిర్​పోర్టుకు నడుస్తున్న ఈ– బస్సులను రోజుకు 5 వేల మంది ఉపయోగించుకుంటున్నారు. 

పొల్యూషన్ ​తగ్గించాలనే..

పర్యావరణ హిత, కాలుష్య రహిత బస్సులను ప్రోత్సహించాలనే లక్ష్యంతోనే టీఎస్​ఆర్టీసీ ముందుకెళ్తోంది. అందులో భాగంగానే కొత్తగా నాన్​ఏసీ ఎలక్ట్రిక్ ​బస్సులను తీసుకొస్తోంది. మొదటి విడతగా 25 బస్సులను అందుబాటులోకి తెచ్చామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీకి మంచి రోజులు వచ్చాయంటున్నారు. మహిళల ఫ్రీ జర్నీతో ఆర్టీసీ బస్సుల ఆక్యుపెన్సీ రేషియో100 శాతానికి పెరిగిందని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న బస్సులపై ఒత్తడి పెరగడంతో, కొత్తగా 2,500 బస్సులను తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఏడాది మే నాటికి 500 బస్సులను ప్రవేశ పెట్టడానికి అధికారులు సిద్ధం అవుతున్నారు. 

ముఖ్యంగా ఎలక్ట్రిక్ ​బస్సులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. సిటీ తర్వాత జిల్లాలకు విస్తరిస్తామని చెబుతున్నారు. 75 మంది కూర్చుని ప్రయాణించేలా ఈ–బస్సు ఉంటుందని అధికారులు తెలిపారు. మూడు నుంచి నాలుగు గంటల్లోపే వందశాతం ఛార్జింగ్​అవుతుందని తెలిపారు. సెల్​ఛార్జింగ్​సదుపాయం, పబ్లిక్​అడ్రసింగ్​సిస్టమ్​ఇందులోని ప్రత్యేకతలు. అలాగే బస్సు క్యాబిన్, లోపల సీసీ కెమెరాలు అమర్చారు. నెల రోజుల బ్యాకప్​ఉంటుందని అధికారులు తెలిపారు. 

రాబోయే రోజుల్లో మరిన్ని బస్సులు

టీఎస్‌ఆర్టీసీ రాబోయే రోజుల్లో మరిన్ని కొత్త బస్సులను తీసుకొస్తుందని ఆర్టీసీ మేనేజింగ్​డైరెక్టర్​సజ్జనార్​తెలిపారు. ఇటీవల ఆర్టీసీ ఉద్యోగులకు 21 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించిన ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. మహాలక్ష్మి పథకాన్ని వినియోగించుకుని ఇప్పటివరకు 25 కోట్ల మంది మహిళలు రాకపోకలు సాగించినట్టు చెప్పారు. రూ.879 కోట్ల డబ్బును ఆదా చేసుకున్నారని తెలిపారు.