
హైదరాబాద్, వెలుగు: హైకోర్టు సూచించిన మేరకు ప్రభుత్వం తమను చర్చలకు పిలవాలని, లేనిపక్షంలో సమ్మెను మరింత ఉధృతం చేస్తామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి హెచ్చరించారు. సోమవారం నుంచి వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని, 30న పది లక్షల మందితో సకల జనుల సమరభేరి బహిరంగ సభ నిర్వహిస్తామని ప్రకటించారు.
ఆర్టీసీ జేఏసీ కార్యాచరణ ఇదే..
సోమవారం ఉదయం 10 గంటలకు రాష్ట్రంలోని అన్ని డిపోల ఎదుట కార్మికుల కుటుంబాలతో బైఠాయింపు, నిరసనలు
22న తాత్కాలిక సిబ్బందిని కలిసి.. కార్మికుల పొట్టకొట్టొద్దని,
ఆర్టీసీ ఆస్తులను కాపాడాలని విజ్ఞప్తులు
23న ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా ప్రజాప్రతినిధులతో ములాఖత్
24న అన్ని డిపోల ఎదుట మహిళా కండక్టర్లతో దీక్షలు
25న రాష్ట్రవ్యాప్తంగా సబ్బండ వర్గాలతో హైవేల దిగ్బంధం, రాస్తారోకోలు
26న డిపోల ఎదుట కార్మికుల కుటుంబాల ఆధ్వర్యంలో దీక్షలు
సీఎం కేసీఆర్ మనసు మారాలని కోరుతూ 27న దీపావళి పండుగకు దూరంగా ఉండాలని నిర్ణయం
30న 10 లక్షల మందితో సకల జనుల సమర భేరి బహిరంగ సభ.
ఆర్టీసీని బతికించుకుందామని, సంస్థలోని అధికారులు కూడా సమ్మెలో కలిసి రావాలని, ప్రైవేట్, అద్దె బస్సుల టెండర్లను అడ్డుకోవాలని కోరారు. ఆదివారం హైదరాబాద్‌లో అఖిలపక్షం, ఆర్టీసీ జేఏసీ నేతలు సమావేశమై.. సమ్మె, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. తర్వాత అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడారు. బంద్‌కు మద్దతిచ్చిన, సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. న్యూడెమోక్రసీ నేత పోటు రంగారావుపై పోలీసులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మహిళలపైనా కావాలనే దాడులు చేస్తున్నారని, అరెస్ట్‌లు చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికుల కోసం ఏ పార్టీ కార్యక్రమం చేసినా అందరూ తప్పకుండా పాల్గొంటారన్నారు. అన్ని రాజకీయ పార్టీలను మరోసారి కలిసే ప్రయత్నం చేస్తామని చెప్పారు.
ధైర్యం సడలొద్దు..
కోర్టు ఉత్తర్వులు సోమవారం నాటికి ప్రభుత్వానికి అందవచ్చని, కార్మికులు మొక్కవోని ధైర్యంతో ఉద్యమాన్ని కొనసాగించాలని అశ్వత్థామరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఒత్తిడికి గురికావద్దని, ఆత్మస్థైర్యం కోల్పోవద్దని, ఆత్మహత్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. పోరాడకుంటే ప్రభుత్వంతో మిలాఖత్ అంటారని, పోరాడితే రాజకీయ పార్టీలు చేయిస్తున్నాయంటారని, లేకుంటే సీఎం కేసీఆరే చేయిస్తున్నారని అంటారని మండిపడ్డారు. సమ్మె విషయంగా ఎన్నో వదంతులు వ్యాపిస్తున్నాయని, తమకు బాగా తెలిసొచ్చిందని పేర్కొన్నారు. ఎవరెన్ని మాట్లాడుకున్నా కార్మికుల ప్రయోజనాలకు భంగం కలిగేలా ఏ జేఏసీ, ఏ సంఘం చేయదని స్పష్టం చేశారు. సోమవారం మరోసారి ఆర్టీసీ జేఏసీ సమావేశం ఉంటుందని చెప్పారు.
పర్మినెంట్ ఉద్యోగాల కోసం పోరాడుదాం: రాజిరెడ్డి
ఆర్టీసీ బస్సుల్లో పనిచేస్తున్న తాత్కాలిక సిబ్బంది సోమవారం నుంచి విధులకు వెళ్లొద్దని ఆర్టీసీ జేఏసీ కో-కన్వీనర్ రాజిరెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది తాత్కాలిక ఉద్యోగాల కోసం కాదని, పర్మినెంట్ జాబ్స్ కోసమని గుర్తు చేశారు. రాష్ట్రంలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటి కోసం నిరుద్యోగులు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. నిరుద్యోగుల పోరాటానికి తాము పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తామని ప్రకటించారు. ఆర్టీసీ సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు సీఎం కేసీఆర్ కుట్ర పన్నారని, దానిని గుర్తించాలని సూచించారు. ఆర్టీసీ జేఏసీ పోరాటం తమ ఆకలి కేకల కోసం కాదని, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడటం కోసమేనని ఆర్టీసీ జేఏసీ కో-కన్వీనర్ వీఎస్ రావు చెప్పారు. లక్ష కోట్ల విలువైన ఆర్టీసీ ఆస్తులను దోచుకోవడానికి జరుగుతున్న ప్రయత్నాన్ని అడ్డుకోవడానికే తాము పోరాడుతున్నామన్నారు. సోమవారం నుంచి చేపట్టనున్న నిరసన కార్యక్రమాలకు పార్టీలు, ప్రజా సంఘాల పూర్తి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
24న విజయవాడలో సామూహిక దీక్షలు: ఏపీ ఆర్టీసీ జేఏసీ
తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఏపీ ఆర్టీసీ జేఏసీ మద్దతు ప్రకటించింది. 24న విజయవాడలో ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో భారీ సామూహిక దీక్షలు చేపట్టనున్నట్టు జేఏసీ నేత సుందరయ్య తెలిపారు. అదే రోజు తమ కార్యాచరణ కూడా రూపొందిస్తామని చెప్పారు. ఆర్టీసీ కార్మికులకు సంఘీభావంగా సోమవారం ఏపీ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. తమిళనాడులోనూ ఒక రోజు సమ్మె చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు వెల్లడించారు.