రూ.లక్ష కోట్ల RTC ఆస్తులు ప్రైవేటుపరం అవుతున్నాయా..? JAC, ప్రభుత్వం ఏమంటున్నాయి..?

రూ.లక్ష కోట్ల RTC ఆస్తులు ప్రైవేటుపరం అవుతున్నాయా..? JAC, ప్రభుత్వం ఏమంటున్నాయి..?

ఆర్టీసీకి ఉన్న ఆస్తుల విలువపై రాష్ట్రమంతటా చర్చ జరుగుతోంది. ఆర్టీసీ రూ.లక్ష కోట్లకు పైగా విలువైన ఆస్తులున్నాయని… వాటిని ప్రైవేటు పరం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని యూనియన్ నాయకులు అంటుంటే.. అన్ని వేల కోట్లు లేవని ప్రభుత్వం అంటోంది. ఆర్టీసీ నాయకులు, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి ఏమంటున్నారో ఓసారి చూద్దాం.

ఆర్టీసీ ఆస్తులు రూ.4వేల కోట్లే : పువ్వాడ అజయ్

ఈ ఉదయం సీఎంతో రివ్యూ మీటింగ్ అయ్యాక రాష్ట్ర ట్రాన్స్ పోర్ట్ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీకి లక్ష కోట్ల రూపాయల ఆస్తులున్నాయన్నది ఉత్తమాటే అన్నారు. “తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు.. మే 15, 2014న జరిగిన బోర్డు మీటింగ్ లో ఆర్టీసీ బ్యాలెన్స్ షీట్ ప్రకారం…. ఆర్టీసీకి తెలంగాణలో ఉన్న ఆస్తుల విలువ రూ.4,416కోట్లు మాత్రమే అన్నారు. 2014 నుంచి 2019 వరకు.. ఒకవేళ పెరిగితే.. కొంత పెరిగి ఉండొచ్చని అన్నారు. ఆర్టీసీ ఉండాలన్నదే సీఎం విధానమన్నారు. పూర్తిగా ప్రైవేటుకు ఇచ్చేస్తామని ఎక్కడా చెప్పలేదన్నారు పువ్వాడ. 50శాతం సొంత బస్సులు.. 30శాతం హైర్ బస్సులు.. 20శాతం ప్రైవేటు ఆపరేటర్లు ఉంటారని అన్నారు. ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటుకు ధారాదత్తం చేస్తామని చెప్పామా అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆర్టీసీని రూ.14కోట్ల ప్రాఫిట్ లోకి తీసుకొచ్చారని అన్నారు పువ్వాడ.

రూ.లక్ష కోట్ల పైమాటే : అశ్వత్థామ రెడ్డి

ఆర్టీసీ ఆస్తుల విలువ రూ.4వేల కోట్లే అని మంత్రి అంటున్నారని .. కానీ.. నిజానికి వాటి విలువ రూ.లక్ష కోట్ల పైమాటే అన్నారు ఆర్టీసీ జేఏసీ నాయకుడు అశ్వత్థామరెడ్డి. అది మా ఆర్టీసీ పూర్వ ఉద్యోగులు, పూర్వీకులు సంపాదించిన ఆస్తి అన్నారు. ఆర్టీసీని వంద శాతం ప్రైవేటుకు ఇవ్వం అంటూ.. యాభై శాతం ఇస్తామని సీఎం చెప్పడం.. తల్లిదండ్రులను నరికి చంపం… ఉపాసం పెట్టి సంపుతం అన్నట్టుగా ఉందని చెప్పారు అశ్వద్ధామ రెడ్డి. వందశాతం ప్రైవేటుకు ఇస్తే అనైతికం అవుతుందని సీఎం అనడం కామెడీగా ఉందన్నారు. యాభై శాతం మాత్రం సమంజసమా అని ప్రశ్నించారు. 50 శాతం RTC ప్రైవేటులో 10 శాతం మేఘా కృష్ణారెడ్డికి, 10శాతం మైహోం రామేశ్వరరావుకు, 10శాతం గోల్డ్ స్టోన్ ప్రసాద్ కు , 20శాతం కేటీఆర్ ట్రాన్స్ పోర్టుకు ఇవ్వాలని సీఎం డిసైడయ్యారని అన్నారు.