సీఎం కేసీఆర్ అసహనంతో మాట్లాడుతున్నారు : ఆర్టీసీ జేఏసీ ఫైర్

సీఎం కేసీఆర్ అసహనంతో మాట్లాడుతున్నారు : ఆర్టీసీ జేఏసీ ఫైర్

కిరణ్ కుమార్ రెడ్డి తరహాలో సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారని ఆర్టీసీ జేఏసీ అధ్యక్షుడు అశ్వత్థామ రెడ్డి అన్నారు. సోమాజి గూడా ప్రెస్ క్లబ్  లో నిర్వహించిన ఆర్టీసీ జేఏసీ నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఉచ్చులో పడి జేఏసీ నేతలు కార్మికుల్ని సమ్మెలోకి దింపుతున్నారని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారని తెలిపారు. ఇప్పుడు కేసీఆర్ కూడా అలాగే మాట్లాడుతున్నారని వివరించారు. యూనియన్లు అస్థిత్వాన్ని కోల్పోలేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ అసహనంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆర్టీసీ జేఏసీ ప్రజా రవాణా వ్యవస్థను కాపాడేందుకు నేనే రాజు నేనే మంత్రి అన్న ధోరణిలో తమ హక్కుల కోసం పోరాడుతుందని, ఆ పోరాటం కేసీఆర్ కు నచ్చడం లేదన్నారు. రావాల్సిన బకాయిలు ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు. ఆర్టీసీ కోసం ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.2,400కోట్లు ఇంకా అందలేదన్నారు. కార్మికుల ప్రావిడెంట్ ఫండ్ రూ. 832కోట్లను ప్రభుత్వం వినియోగించుకుందన్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె ఎందుకు చేస్తున్నారో ప్రజలు గమనించాలని కోరారు.  తమ పొట్ట కూటికోసం సమ్మెచేయడం లేదన్న ఆయన..బంగారు తెలంగాణలో ఆర్టీసీని బ్రతించాలని సమ్మె చేస్తున్నామని, తద్వారా తక్కువ ఛార్జీలతో ప్రయాణం, విద్యార్ధులకు బస్ పాస్ పొందవచ్చని ఆర్టీసీ జేఏసీ అధ్యక్షుడు అశ్వత్థామ రెడ్డి సూచించారు.