ఆర్టీసి కార్మిక నేతలు కూడా డ్యూటీలు చేయాల్సిందే

ఆర్టీసి కార్మిక నేతలు కూడా డ్యూటీలు చేయాల్సిందే

ఆర్టీసీ కార్మికులు  అందరూ నిన్న(శుక్రవారం) ఉదయం విధుల్లో చేరారు. తమను విధుల్లో చేర్చుకోవాలంటూ కార్మికులు ప్రభుత్వాన్ని వేడుకోవడంతో సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. అందరినీ డ్యూటీల్లో చేరి…ఉద్యోగాలు చేసుకోండని చెప్పారు. మరోవైపు బస్సు భవన్‌లోని అధికారిక కార్మిక సంఘం TMU కార్యాలయానికి ఆర్టీసీ యాజమాన్యం తాళం వేసింది. అంతేకాదు  ఆర్టీసి కార్మిక నేతలు కూడా ఇప్పటి నుంచి సాధారణ కార్మికుల మాదిరిగానే విధులు నిర్వహించాల్సిందేనని తెలిపింది. ఇప్పటివరకూ వారికి కల్పించిన విధులు నుంచి మినహాయింపు హక్కులను రద్దు చేసింది. దీని ప్రకారం ఆర్టీసి కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డితో సహా యునియన్‌ నేతలంతా డ్యూటీలు చేయాలి. ఇతర కార్మికుల మాదిరిగానే వారందరు విధులకు హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పారు అధికారులు.

ఇప్పటి వరకు మొత్తం 30 మంది కార్మిక నేతలకు డ్యూటీ మినహాయింపు ఉండేది. ఇందులో అధికారిక కార్మిక సంఘమైన తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ ( TMU))కు చెందిన వారు 26 మంది ఉన్నారు. ఇంకా కార్మికుల నుంచి యూనియన్‌ సభ్యత్వ రుసుమును వసూలు చేసే విధానానికి కూడా త్వరలో చెక్‌ పెట్టాలని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఆర్టీసీ యూనియన్లు ఉండకూడదని అధికారులు చర్యలు చేపట్టారు.