
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ కార్మికుల సమస్యలు నెరవేర్చాలంటూ డిమాండ్ చేస్తూ ఈ నెల 7న హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద మహా ధర్నా చేపడుతున్నామని జేఏసీ చైర్మన్ రాజిరెడ్డి తెలిపారు. ఈ ధర్నాను విజయవంతం చేయాలని అన్ని డిపోల కార్మికులకు ఆయన పిలుపునిచ్చారు. 2019 అక్టోబర్‌లో చేపట్టిన ఆర్టీసీ సమ్మె సందర్భంగా ఈ నెల 5న ‘‘ఆర్టీసీ పరిరక్షణ -కార్మికుల త్యాగాల దినం’’గా పాటిస్తూ అమరులకు శ్రద్ధాంజలి ఘటించాలని కోరారు.
ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఆర్టీసీ జేఏసీ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ, కార్మికులకు పెండింగ్‌లో ఉన్న రెండు పీఆర్సీలు, డీఏ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సీసీఎస్‌కు బకాయి ఉన్న రూ.1,075 కోట్లు, పీఎఫ్ ట్రస్ట్, ఎస్‌ఆర్‌బీఎస్, ఎస్‌బీటీ, రిటైర్ అయిన కార్మికులకు సెటిల్‌మెంట్ ఫండ్స్ చెల్లించాలని కోరారు. ఈ సమావేశంలో జేఏసీ కన్వీనర్ వీఎస్ రావు, రాములు, దశరథ్ తదితరులు పాల్గొన్నారు.