- .ఆల్‌టైమ్ రికార్డు.. రూ.2,428 కోట్లు ఆదా: ఆర్టీ సీ ఎండీ నాగిరెడ్డి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణంతో రోజుకు 37.09 లక్షల మంది మహిళలు ప్రయాణిస్తూ ఆల్‌టైమ్ రికార్డు సృష్టించినట్లు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తెలిపారు. పథకం విజయవంతం కావడానికి కృషి చేసిన అన్ని జిల్లాల ఆర్‌ఎంలు, ఈడీలతో మంగళవారం బస్ భవన్‌లో ఎండీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారిని అభినందించారు.
పెరుగుతున్న మహిళా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సు సర్వీసులను క్రమబద్ధీకరించడంతో పాటు.. ప్రత్యేక ట్రిప్పులు నడిపి ప్రయాణికుల నమ్మకాన్ని ఆర్టీసీ గెలుచుకుందని ఎండీ అన్నారు. పథకం సక్సెస్‌లో అధికారులతో పాటు సిబ్బంది కృషిని ఆయన ప్రశంసించారు. ఈ పథకం ప్రారంభంలో రోజుకు 29.42 లక్షల మంది మహిళలు ప్రయాణించేవారని..
ప్రస్తుతం ఆ సంఖ్య 37 లక్షలకు పెరగడంపై ఎండీ సంతోషం వ్యక్తం చేశారు. దీని ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో మహిళలు రూ.2,428.47 కోట్లను ఆదా చేసుకున్నారని చెప్పారు. ఇది ఎన్నో కుటుంబాల్లో ఆర్థిక స్థిరత్వానికి దోహదపడిందని తెలిపారు.
