Swapnalok fire : స్వప్నలోక్ ప్రమాదం వెనక క్యూనెట్

Swapnalok fire : స్వప్నలోక్ ప్రమాదం వెనక క్యూనెట్

సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం జరగటం.. ఆరుగురు క్యూనెట్ మార్కెటింగ్ నెట్ వర్క్ కంపెనీలు యువకులు చనిపోవటంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్. 2023, మార్చి 18వ తేదీ శనివారం ఆయన ఈ అంశంపై వరసగా ట్విట్లు చేశారు. స్వప్నలోక్ కాంప్లెక్స్ ఫైర్ యాక్సిడెంట్ కు.. క్యూనెట్ కు ఉన్న సంబంధం ఏంటీ.. సజ్జనార్ ఏమంటున్నారో ఓ సారి చూద్దాం...

వీసీ సజ్జనార్ :

సికింద్రాబాద్‌ స్వప్నలోక్‌ కాంప్లెక్స్ అగ్నిప్రమాద ఘటనలో దుర్మార్గపు సంస్థ.. #QNet‌ పాత్రపై సమగ్ర విచారణ జరగాలి. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి.. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి. మోసపూరిత సంస్థల కదలికలపై లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీస్‌ నిఘా పెట్టాలి.  ఈ దుర్ఘటనలో మధ్య తరగతి కుటుంబాలకు చెందిన ఆరుగురు యువతీయువకులు చనిపోవటం కలిచి వేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా..  వారి కుటుంబసభ్యులకు ఎల్లవేలలా అండగా నిలుస్తాం అంటూ ట్విట్లు చేశారు. అదే విధంగా భారీ డబ్బును ఆశచూపి అమాయకులను మోసం చేస్తోన్న క్యూనెట్‌ బాగోతం ఈ అగ్నిప్రమాదంతో మరోసారి బయటపడింది. క్యూనెట్‌ అమాయకులైన ఆరుగురిని పొట్టనబెట్టుకుంది. ఆ కాంప్లెక్స్‌లో బీఎం5 సంస్థ పేరిట కాల్‌ సెంటర్ నిర్వహిస్తూ.. తెర వెనక క్యూనెట్‌ ఎంఎల్‌ఎం దందా సాగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని అనుమానాలు వ్యక్తం చేశారు సజ్జనార్.

దాదాపు 40 మందికిపైగా యువతీ యువకులు అక్కడ పని చేస్తున్నట్లు తెలుస్తోంది. క్యూనెట్‌ ఏజెంట్లు ఒక్కొక్కరి దగ్గరి నుంచి లక్షన్నర నుంచి మూడు లక్షల రూపాయల వరకు కట్టించుకున్నట్లు మృతుల  కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.  మోసపూరిత క్యూనెట్‌ పై అనేక కేసులు నమోదు చేసినా.. ఈడీ ఆస్తులను జప్తు చేసిన తీరు మారడం లేదంటూ జరుగుతున్న తతంగాన్ని ఎత్తి చూపారు తన ట్విట్ల ద్వారా సజ్జనార్. 

యువతీయువకుల్లారా!.. అధిక డబ్బుకు ఆశపడి క్యూనెట్‌ లాంటి మోసపూరిత ఎంఎల్‌ఎం సంస్థల మాయలో పడకండి. మీ బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకోకండి. ఎంఎల్‌ఎం సంస్థలు అరచేతిలో వైకుఠం చూపిస్తూ.. యువతను ఆకర్శిస్తూ బుట్టలో వేసుకుంటున్నాయి. జాగ్రత్తగా ఉండండి అంటూ హెచ్చరికలు జారీ చేశారాయన. మోసపూరిత సంస్థల విషయంలో భవన యాజమానులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.. సంస్థ మోసపూరితమైందా? కాదా? అని ఒకటికి రెండుసార్లు నిర్ధారించుకుని అద్దెకి ఇవ్వాలి. భవన యజమానులు అధిక అద్దెకు ఆశపడి.. ఇలాంటి మోసాలకు బాధ్యులు కావొద్దు అంటూ సలహా కూడా ఇచ్చారు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్.

స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్నిప్రమాదం వెనక.. యువతీ యువకుల మరణం వెనక క్యూనెట్ సంస్థ ఉన్నట్లు మాజీ పోలీస్ కమిషనర్ ఆరోపణలు, విమర్శలు చేయటం కలకలం రేపుతోంది. మాజీ పోలీస్ కమిషనర్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటే.. నిప్పు లేకుండా పొగ వస్తుందా అంటున్నారు.. సజ్జనార్ కామెంట్లను విచారణ అధికారులు ఏ విధంగా తీసుకుంటారు అనేది ఇప్పుడు ఆసక్తి కలిగిస్తున్న అంశం..