భద్రాద్రికొత్తగూడెం/ఖమ్మం టౌన్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మహాలక్ష్మి’ పథకం ద్వారా మహిళలకు కోట్లాది రూపాయలు ఆదా అయ్యాయని ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి చెప్పారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం బస్టాండ్‌ను సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాలక్ష్మి పథకం కింద ఇప్పటివరకు 250 కోట్ల ప్రయాణాలు జరిగాయన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షల మంది ప్రయాణం చేస్తుంటే.. ఇందులో 45 లక్షల మంది మహిళలేనని చెప్పారు. కాలుష్య నివారణలో భాగంగా వచ్చే మూడేండ్లలో హైదరాబాద్ సిటీలో పూర్తి స్థాయిలో ఎలక్ట్రికల్ బస్సులు నడపనున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు 800 బస్సులు నడుస్తున్నాయని, ఇందులో 500 ఇంటర్ సిటీ కాగా.. 300 బస్సులు హైదరాబాద్‌లో సిటీలో నడుపుతున్నామన్నారు.
రూ. 50 కోట్లతో రాష్ట్రంలో పలు చోట్ల బస్టాండ్ల నిర్మాణాలు, రిపేర్లు చేపడుతున్నామన్నారు. కార్గోను ఇంకా విస్తరించే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఆర్‌ఎం సరిరాం, డిపో మేనేజర్జయలక్ష్మి ఉన్నారు. ఈ సందర్భంగా డిపోలోని గ్యారేజీలో మొక్క నాటారు. అనంతరం ఖమ్మం ఆర్టీసీ న్యూ బస్టాండ్‌ను సందర్శించి.. పరిసరాలు, ప్యాసింజర్లకు అందజేస్తున్న మౌలిక వసతుల గురించి తెలుసుకున్నారు. డిప్యూటీ రీజినల్ మేనేజర్ వి.మల్లయ్య, డిపో మేనేజర్ ఎం. శివ ప్రసాద్, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ రవీందర్ ఉన్నారు.
