కార్మికుల్లో ధైర్యం కోసం.. ఆర్టీసీ సకల జనుల సభ: షరతులివే

కార్మికుల్లో ధైర్యం కోసం.. ఆర్టీసీ సకల జనుల సభ: షరతులివే

ఆర్టీసీ జేఏసీ సకల జనుల సమర భేరికి సిద్ధమైంది. సరూర్ నగర్ లో సభ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. సమ్మెకు ప్రజల వైపు నుంచి ఉన్న మద్దతును చూపించి.. కార్మికుల్లో ఆత్మస్థైర్యం కల్పించాలన్న లక్ష్యంతో ఈ సభకు పిలుపునిచ్చామని ఆర్టీసీ జేఏసీ చెబుతోంది. కానీ పోలీసుల తీరుతో కార్మిక నేతల ఉద్దేశం పూర్తి స్థాయిలో నెరవేరేలా కనిపించడం లేదు.

కార్మికుల్లో ఆత్మస్థైర్యం నింపడానికే…

సరూర్ నగర్ లో సకల జనుల సభకు భారీ స్థాయిలో ప్లాన్ చేసుకుంది ఆర్టీసీ జేఏసీ. సభకు కార్మికులంతా కుటుంబాలతో సహా రావాలని భావించారు. అలాగే ప్రజలు కూడా భారీగా వస్తారని ఆశించారు. జిల్లాల నుంచి కూడా మంగళవారం సాయంత్రానికే చాలా మంది కార్మికులు హైదరాబాద్ చేరుకున్నారు. మొత్తం లక్షన్నర పైగా జనం వస్తారని అంచనాతో ఉన్నారు. విపక్షాలన్నీ కూడా మద్దతు ప్రకటించడంతో ఆయా పార్టీల నాయకులు సభలో ప్రసంగించి కార్మికులకు ధైర్యం చెబుతారని అనుకున్నారు. ఆత్మస్థైర్యంతో ఉండాలని, ఆత్మహత్యలు వద్దని ఈ వేదికగా పిలుపునివ్వాలని భావించారు జేఏసీ నాయకులు.

నో చెప్పిన పోలీసులు.. హైకోర్టు చెప్పాక ఓకే..

కానీ సకల జనుల సభకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో నిన్న హైకోర్టును ఆశ్రయించారు కార్మిక నేతలు. తమ వాదనను సమర్థంగా వినిపించడంతో ఈ సభకు అనుమతివ్వాలని పోలీసులకు సూచించింది న్యాయస్థానం. అయితే కొన్ని షరతులను విధించింది.

ఇప్పటికైనా ఆలోచించండి

సభకు హైకోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ పోలీసులు కార్మికులను అడ్డుకుంటున్నారని జేఏసీ నేతలు ఆరోపిస్తున్నారు. జిల్లాల నుంచి వచ్చే వారికి ఆటంకాలు కల్పిస్తున్నారని చెబుతున్నారు. కోర్టు చెప్పినా ఇలా వ్యవహరించడం తగదని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టులో ప్రభుత్వానికి ప్రతికూలంగా నిర్ణయాలు వస్తున్నాయని, ఇకనైనా కేసీఆర్ తమ డిమాండ్లపై ఆలోచించాలని వారు కోరుతున్నారు. సమస్యల పరిష్కారానికి ముందుకొచ్చి.. సమ్మె విరమింపజేసేలా చర్యలు తీసుకోవాలని వరంగల్ కార్మికులు డిమాండ్ చేశారు.

హైకోర్టు షరతులివే:

  • సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలోనే సభ నిర్వహించాలి.
  • సభలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేయొద్దు.
  • ఐదుగురు వక్తలు మాత్రమే మాట్లాడాలి.
  • సభలో ప్రసంగించే వారి పేర్లు పోలీసులకివ్వాలి.
  • వక్తల ప్రసంగాలను వీడియో తీసుకునేందుకు పోలీసులకు ఓకే.
  • ఐదు వేల మందికి మించి సభకు రాకూడదు.
  • మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు సభ.
  • ఊరేగింపులు, ర్యాలీలు నిర్వహించకూడదు.
  • సాయంత్రం ఏడు గంటల కల్లా స్టేడియం నుంచి అంతా వెళ్లిపోవాలి.