- ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, యూనియన్లకు అనుమతి తప్ప
- మిగతా సమస్యలపై చర్చకు సిద్ధం : మంత్రి పొన్నం
హైదరాబాద్, వెలుగు: ఏప్రిల్ 22 నుంచి సమ్మె చేయనున్నామని ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. సోమవారం సాయంత్రం జాయింట్ లేబర్ కమిషనర్ సునీతా గోపాల్ దాస్ సమక్షంలో జరిగిన చర్చల్లో మరోసారి ఆర్టీసీ యాజమాన్యం తరపున అధికారులు ఎవరూ పాల్గొనకపోవడంతో జేఏసీ నేతలు ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.
కేవలం సమ్మె నోటీసు చ్చిన కార్మిక సంఘాల నేతలే మూడోసారి కూడా చర్చలకు హాజరవడంతో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన జేఏసీ నేతలు... వెంటనే సమ్మె తేదీని ప్రకటించారు. ఈ నెల 22న ఉదయం డ్యూటీ నుంచి ఆర్టీసీ కార్మికులంతా సమ్మెలో పాల్గొంటారని జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న ప్రకటించారు. మొత్తం 32 డిమాండ్లతో తాము ఈ సమ్మెలోకి వెళ్తున్నామని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టింపులేనితనంతోనే తాము విధిలేని పరిస్థితుల్లో న్యాయబద్ధంగా సమ్మెకు దిగుతున్నామని వెల్లడించారు.
‘‘లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలో ఇప్పటికే రెండు దఫాలుగా జరిగిన చర్చలకు ఆర్టీసీ యాజమాన్యం తరపున అధికారులు ఎవరు హాజరుకాకుండా కుంటి సాకులతో వాయిదా వేశారు. చివరకు మూడోసారి సోమవారం జరిగిన చర్చలకు కూడా యాజమాన్యం రాకుండా కేవలం లేఖ పంపించారు. ఇప్పటికైనా తమ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం వద్ద తగిన సమయం ఉంది. ఆలోపు మా డిమాండ్లపై సానకూలంగా స్పందించి, పరిష్కరిస్తే సమ్మె నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటాం” అని వెంకన్న స్పష్టం చేశారు.
అయితే ప్రభుత్వానికి ఆ ఆలోచన ఏమాత్రం కనిపించడం లేదని, అందుకే ఈనెల 22 నుంచి సమ్మె అనివార్యమని, కార్మికులంతా ఈ సమ్మెలో పాల్గొని తమ ఐక్యతను చాటాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా.. ఆర్టీసీ కార్మికులు ప్రేరేపిత సమ్మెలోకి పోవద్దని రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్.. కార్మికులకు విజ్ఞప్తి చేశారు. సోమవారం మీడియాతో ఆయన మాట్లాడారు. ఇప్పటికే పెండింగ్ లో ఉన్న డీఏలు ఇచ్చామని, పీఆర్సీ ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని మంత్రి చెప్పారు.
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం కావాలనే విషయంపై కమిటీ వేశామని, ఆ రిపోర్టు రావాల్సి ఉందన్నారు. ఇక ఆర్టీసీలోకి యూనియన్లను అనుమతించడం అనేది ప్రభుత్వ పరిశీలనలో లేదని, ఆ రెండు డిమాండ్లు మినహా మిగతా సమస్యలపై ఆర్టీసీ జేఏసీ నేతలతో చర్చించేందుకు ఎప్పుడైనా తాను సిద్ధమని మంత్రి చెప్పారు.

